సంగారెడ్డిలో ఎవరికి వారే..!

In The Campaign Of The Great Coalition Leaders There Is No Way To See Them. - Sakshi

కూటమి నేతల నడుమ సమన్వయమేదీ?

టీఆర్‌ఎస్‌లో చేరిన టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు

అడ్రస్‌ లేని కూటమి స్టార్‌ క్యాంపెయినర్లు

ఎవరికి వారుగా సొంతంగా ప్రచారంలోకి..

మరో ఐదు రోజుల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనుండగా, జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని పట్టాలు ఎక్కించేందుకు శ్రమిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు సొంత ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకుని జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ తరఫున అగ్రనేతలు, స్టార్‌ క్యాంపెయినర్లు ఎవరూ జిల్లా ముఖం చూడకపోవడంతో, అభ్యర్థులే ప్రచార ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. మరో వైపు మహా కూటమి నేతల నడుమ సమన్వయ లోపంతో, ప్రచార పర్వంలో ఎక్కడా వారి జాడ కనిపించడం లేదు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల ప్రచార గడువు మరో నాలుగైదు రోజుల్లో ముగుస్తున్నా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారం ఇంకా పట్టాలెక్కే దశలోనే ఉంది. పార్టీ అగ్రనేతలు, స్టార్‌ క్యాంపెయినర్లు ఎవరూ జిల్లాలో ప్రచారంలో పాల్గొనేందుకు రావడం లేదు. దీంతో అభ్యర్థులే తమ నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని వేడెక్కించేందుకు తంటాలు పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పీపుల్స్‌ ఫ్రంట్‌ పేరిట కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమి ఏర్పాటైనా, సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే రంగంలో ఉన్నారు. 

కూటమి భాగస్వామ్య పార్టీలు టీడీపీ పటాన్‌చెరు, టీజేఎస్‌ సంగారెడ్డి సీటును ఆశించినా.. ఐదు చోట్లా కాంగ్రెస్‌ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. సంగారెడ్డి స్థానాన్ని ఆశించిన టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్‌ రెండు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీకి చెందిన మరో నాయకుడు నాగేశ్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడా టీజేఎస్‌ శ్రేణులు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారంలో కనిపించడం లేదు. పటాన్‌చెరులో టీడీపీ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మరో నేత గడీల శ్రీకాంత్‌గౌడ్‌ మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి పటాన్‌చెరు టికెట్‌ ఆశించి భంగపడిన సపానదేవ్, శశికళ యాదవరెడ్డి, శంకర్‌ యాదవ్‌ ప్రచారం చేస్తుండగా, గాలి అనిల్, జె.రాములు అడపాదడపా కనిపిస్తున్నారు. 

కనిపించని స్టార్‌ క్యాంపెయినర్లు
ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి జిల్లాలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించ లేదు. ఏఐసీసీ, టీపీసీసీ తరఫున చెప్పుకోదగిన స్థాయి ఉన్న నేతలెవరూ ప్రచారంలో కనిపించడం లేదు. గతంలో మెదక్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న విజయశాంతి ఒక్క సభలోనూ పాల్గొనలేదు. దీంతో జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులే సొంతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కీలక అనుచరులు అభ్యర్థుల ప్రచార పర్వాన్ని సమన్వయం చేయడంతో పాటు, తెరవెనుక వ్యూహాలను అమలు చేస్తున్నారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆయన సతీమణి పద్మినిరెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి గీతారెడ్డి ముఖ్య అనుచరులతో ప్రచార తీరు తెన్నులను రూపొందించుకుంటున్నారు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారంలో ఒంటరి పోరు చేస్తుండగా, ఆయన భార్య నిర్మల కూడా అక్కడక్కడా ప్రచారంలో పాల్గొంటున్నారు. నారాయణఖేడ్‌లో టికెట్‌ ఆశించి భంగపడిన సంజీవరెడ్డి చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడంతో మాజీ ఎంపీ షెట్కార్‌.. చెల్లాచెదురైన కేడర్‌ను సమీకరించుకునే పనిలో ఉన్నారు. ప్రచార పర్వం ముగిసే నాటికి ఒకరిద్దరు ముఖ్య నేతలు జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top