బీఎస్పీతోనే రాజ్యాధికారం

BSP is the royal authority - Sakshi

సాక్షి, జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జనాభాలో అత్యధిక శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం దక్కాలంటే బహుజన సమాజ్‌ పార్టీతోనే సాధ్యమని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. బహుజనులు ఐక్యంగా పోరాడి బీఎస్పీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఒంటరిగా 112 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఉత్తరప్రదేశ్‌లో నాలుగు సార్లు బీఎస్పీ అధికారంలోకి వచ్చి బహుజనులతోపాటు అగ్రవర్గాల్లోని పేదల సంక్షేమ కోసం కృషిచేశామన్నారు. అదే తరహాలో తెలంగాణలో సైతం తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే సర్వజన హితాయః సర్వజన సుఖాయః ప్రకారం పనిచేసి తెలంగాణ ప్రజల మన్ననలు పొందుతామన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణలో ఈసారి అన్ని స్థానాల్లో బీఎస్పీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. టిక్కెట్ల కేటాయింపులో సైతం అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం పాటించామన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలకు అవశాశం ఇచ్చారని, ఈసారి బీఎస్పీ అధికారం కట్టబెట్టాలని కోరారు.

ఐదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలే 
తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ప్రతి కుటుంబానికి రూ.15–20 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించి ఐదేళ్లయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాయావతి ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు పేదరికం, నిరుద్యోగాన్ని మరింత పెంచాయని ఆరోపించారు.

తప్పుడు ఆర్థిక విధానాలతో దేశాన్ని అధోగతి పాలుచేశారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, పెట్రోల్, డిజిల్‌ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుజనుల బాగోగులను పట్టించుకోవడలో విఫలమయ్యాయని మండిపడ్డారు. 

ఒక్కసారి అవకాశం ఇవ్వండి 
బీఎస్పీ అధికారంలో సర్వజన హితాయః సర్వజన సుఖాయః సూత్రాన్ని అమలు చేశామని అదే తర హాలో తెలంగాణలో పాలన అందిస్తామని తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాయావతి కోరారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు అన్ని రంగాల వారికి అభివృద్ధి ఫలాలు అందిస్తామన్నారు.

జులూం చేసే వారిని జైలుకు పంపించామని, నిరుద్యోగ సమస్యను తగ్గించామన్నారు. బహుజనుల ఓ ట్లతో అధికారంలోకి వచ్చి వారిపైనే దోపిడీకి పాల్పడుతున్న పార్టీలకు సామ, దాన, బేధ, దండోపాయా ల ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు డ బ్బులు పెట్టి ప్రచారం చేయిస్తున్నాయని, తమ అను కూల మీడియాల ద్వారా ముందస్తు ఫలితాలను ప్ర చారం చేయిస్తున్నామని ఆరోపించారు. తమ పార్టీ మేనిఫెస్టో చెప్పదని, తక్కువ చెప్పి.. ఎక్కువ పని చేస్తుందన్నారు.  

పాలమూరులో జెండా ఎగురవేస్తాం 
ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించుకుని పాలమూరులో పార్టీ జెండాను ఎగురవేస్తామని మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి  ఇబ్రహీం అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని సంపాదనపై ఏమాత్రం మమకారం లేదన్నారు. బహుజనులంతా ఏకమై పని చేస్తే బీఎస్పీ కచ్చితంగా గెలుస్తుందన్నారు.

తనను గెలిపిస్తే పాలమూరు ప్రజల జీవితాల్లో మార్పు తెస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్‌ వెంట నడిచానని ఆయన రెండు సార్లు టికెట్‌ ఇచ్చినా స్థానిక నాయకులు తనను ఓడించారని ఆరోపించారు. . తాను రాజీపడి ఉంటే టీఆర్‌ఎస్‌లో తనకు ఉన్నత పదవులు దక్కేవని, అలా కాకుండా ప్రజలకు మేలు చేయాలనే బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top