అంతు చిక్కని భూముల లెక్కలు

Bodan Sugar Factory Lands Are Occupied In Nizamabad District - Sakshi

వివాదాస్పదమవుతున్న నిజాం ఫ్యాక్టరీ భూములు

రూ.కోట్ల విలువైన స్థలాల అన్యాక్రాంతం?

రెవెన్యూ శాఖ వద్ద లేని రికార్డులు

సాక్షి, బోధన్‌: బోధన్‌ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీకి చెందిన భూముల వ్యవహారం గందరగోళంగా మారింది.. ఫ్యాక్టరీ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేకుండా పోయింది. మొదట్లో 16 వేల ఎకరాలకు పైగా ఉన్న ఫ్యాక్టరీ భూములు క్రమంగా అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో కూడా చాలా వరకు కబ్జాకు గురవుతున్నాయి! ఫ్యాక్టరీ భూముల కొనుగోళ్లు, పట్టామార్పిళ్లు, రిజిస్ట్రేషన్ల వ్యవహారం తరచూ వివాదాస్పదంగా మారుతోంది. ఫ్యాక్టరీకి సంబంధించిన భూ రికార్డులు రెవెన్యూ శాఖ వద్ద లేకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోంది.

తాజాగా బోధన్‌ నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) పరిధిలో గల కేన్‌యార్డును ఆనుకుని 2.30 ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నించడంతో మరోమారు ఈ భూముల వ్యవహారం చర్చనీయాంశమైంది. రూ.కోట్ల విలువైన ఖాళీ స్థలాన్ని ఇటీవల కొందరు జేసీబీతో చదును చేయిస్తుండగా, ఆ స్థలం పక్కనే ఉన్న హనుమాన్‌ టేకిడి కాలనీ యువకులు అడ్డుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కబ్జా వ్యవహారం తేల్చాలని అఖిలపక్షాలు ఆందోళనకు కూడా దిగాయి. 2002లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనంతరం నిజాంషుగర్స్‌ భూములు, ఖాళీ స్థలాల రక్షణకు అప్పట్లో ప్రభుత్వం పలువురు అధికారులతో కోర్‌ కమిటీని నియమించింది. ప్రస్తుతం భూములు కబ్జాకు గురవుతుంటే ఈ కమిటీ ఏం చేస్తుందో ఏమో మరీ!? 

16 వేల ఎకరాలు.. 
నిజాం పాలనలో 1938లో బోధన్‌లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఫ్యాక్టరీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 16 వేల ఎకరాల భూములను అప్పట్లో సాగు కోసం కేటాయించారు. బోధన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్ని, మోస్రా, చందూర్‌ తదితర మండలాల పరిధిలో ఈ భూముల్లో 16 వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసి చెరుకు పంట సాగును ప్రోత్సహించారు. 1992 నుంచి ఫ్యాక్టరీ భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల పేదలకు ఎకరం చొప్పున గత ప్రభుత్వాలు పంపిణీ చేశాయి.

కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ చేసిన భూములు సుమారు 8,500 ఎకరాలు, బహిరంగ వేలంపాట ద్వారా మరో 3,500 ఎకరాలు విక్రయించారు. అలాగే, వీఆర్‌ఎస్‌ పొందిన కార్మికులకు 1,292 ఎకరాలను కేటాయించినట్లు ఎన్‌ఎస్‌ఎఫ్‌ కోర్‌ కమిటీ రికార్డులు చెబుతున్నాయి. పేదల ఇళ్ల స్థలాలు, పట్టణ డంపింగ్‌ యార్డులు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రార్థనాలయాలు, సంక్షేమ హస్టళ్ల భవనాలు కూడా ఫ్యాక్టరీ స్థలాల్లోనే నిర్మించారు. కొన్నిచోట్ల చెరువుల శిఖంలో ఫ్యాక్టరీ భూములుండగా, ఫ్యాక్టరీకి చెరుకు తరలింపు కోసం నిర్మించిన లైట్‌ రైల్వే లైన్‌ స్థలం 188 ఎకరాలు రోడ్లుగా మారాయి.

ఎన్‌డీఎస్‌ఎల్‌ వద్ద 191 ఎకరాలు 
2002లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిజాం షుగర్స్‌ను ప్రైవేటీకరించింది. 51 శాతం ప్రైవేట్‌ కంపెనీ వాటా, 49 శాతం ప్రభుత్వ వాటాతో ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరమైంది. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఎన్‌డీఎస్‌ఎల్‌ ప్రైవేట్‌ యాజమాన్యం చేతిలోకి వెళ్లింది. ప్రైవేట్‌ యాజమాన్యం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న విలువైన భూములను కొనుగోలు చేసింది. 20 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉండగా,  మిగిలిన భూములను కూడా కొనుగోలు చేసిందని కోర్‌ కమిటీ అధికారులంటున్నారు. 2015 డిసెంబర్‌ 23న ఎన్‌డీఎస్‌ఎల్‌ మూసివేతకు గురి కాగా, అక్రమార్కులు ఫ్యాక్టరీకి చెందిన విలువైన ఖాళీ స్థలాలపై కన్నేశారు. శక్కర్‌నగర్‌ ప్రాంతంలో పలు చోట్ల కోర్‌ కమిటీ ఆధీనంలో రూ.కోట్ల విలువైన స్థలాలున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

పేదల ఇక్కట్లు.. 
మరోవైపు, కార్పొరేషన్ల ద్వారా పేదలు కొనుగోలు చేసిన భూములు చాలా చోట్ల వివాదాస్పదంగా మారాయి. కొందరికి భూములుంటే పట్టాలు లేవు.. పట్టాలున్న వారికి భూముల్లేవు. కొందరికి భూములున్నా హద్దులు చూపించలేదు. ప్రతి సోమవారం బోధన్‌ ఆర్డీవో ఆఫీసులో నిర్వహించే ప్రజావాణిలో ఇలాంటి వినతులు ఎన్నో వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు సుమారు 500కు పైగానే ఉంటాయి.

భూములపై దృష్టి సారించాం 
ఫ్యాక్టరీ భూములు, స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా దృష్టి సారించాం. కార్పొరేషన్‌ ద్వారా పేదలు కొనుగోలు చేసిన భూముల సమస్యలపై మా వద్దకు 350 వరకు వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – ఖాలిద్‌ అలీ, ఎన్‌ఎస్‌ఎఫ్‌ కోర్‌ కమిటీ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top