వేచిచూద్దాం!

BJP Waiting For Announce Candidates List In Rangareddy - Sakshi

పక్క పార్టీల నేతలపై బీజేపీ దృష్టి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రత్యర్థి శిబిరాల్లో లుకలుకలను అదునుగా మలుచుకోవాలని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది. సొంతబలం కన్నా.. పక్కపార్టీ నేతల సమర్థతపై ఎక్కువ విశ్వాసం ఉంచుతున్న కమలనాథులు మహాకూటమి అభ్యర్థులను ప్రకటించేవరకు వేచిచూసే ధోరణిని అవలంభించాలని నిర్ణయించారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయితే ఆయా పార్టీలో ముసలం పుడుతుందని భావిస్తున్న బీజేపీ అప్పటివరకు అభ్యర్థులను ప్రకటించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గాల వారీగా జరిగిన అభిప్రాయ సేకరణలోనూ ఇదే భావన వ్యక్తమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మహాకూటమి నడుమ సీట్ల పంపకంపై చర్చలు తుది దశకు చేరుకోవడం.. కొందరు మిత్రులు డెడ్‌లైన్‌ విధించిన నేపథ్యంలో సీట్లపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుం దని బీజేపీ అంచనా వేస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా కొలి క్కి వచ్చింది. దసరాలోపు అభ్యర్థులను ప్రకటించాలని కృతనిశ్చయంతో ఉన్న ఆ పార్టీ వాయు వేగంతో గెలుపుగుర్రాలను వడపోస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ.. టికెట్లురాని వారిపై గాలం వేయాలని భావిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష ద్వారా అసంతృప్తి నాయకులను చేరదీయాలని వ్యూహరచన చేసింది. ముఖ్యంగా ఆశావహులు ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌పై ఈ ఆస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలపై వల విసరాలని అనుకుంటోంది.

టికెట్‌ ఆశించి భంగపడ్డ వారికి టికెట్‌ ఆఫర్‌ ఇవ్వాలని భావిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం.. గెలిచే అభ్యర్థులుంటే తీసుకునేందుకు వెనుకాడేదిలేదని తేల్చిచెప్పారు. దీనికితోడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావిస్తున్న ఆ పార్టీ కనిష్టంగా 20 అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీలోని అసమ్మతి నేత లపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ టికెట్లు రాని నాయకులతో మంతనాలు సాగిస్తున్న కమల దళం తాజాగా కాంగ్రెస్, టీడీపీలపై కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీంతో మహాకూటమి టికెట్ల కేటాయింపు వరకు వేచిచూ డాలని నిర్ణయించింది. ఆ తర్వాత టికెట్ల కసరత్తు పూర్తి చేయాలని అనుకుంటోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top