బీజేపీ పక్కచూపులు

BJP Candidate Election Problems, Warangal - Sakshi

ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు ‘టికెట్‌’ ఆఫర్లు

పాగా కోసం ప్రయత్నాలు

నాలుగు జాబితాలు ప్రకటించినా పెండింగ్‌లోనే..

జనగామకు ఖరారు కాని అభ్యర్థి

ఆచితూచి వ్యవహరిస్తున్న కమలనాథులు

సాక్షి, జనగామ: ప్రధాన పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తి నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టికెట్‌ రాక పోటీచేయాలని భావిస్తున్న నాయకులను పార్టీలోకి తీసుకొచ్చి తమ పార్టీ తరుపున రంగంలోకి దింపడానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీ ప్రకటించిన మూడు జాబితాల్లోనూ జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు వెలువడలేదు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన నాలుగో జాబితాలో పాలకుర్తి అభ్యర్థిని ప్రకటించారు. జనగామను పెండింగ్‌లో పెట్టి ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో రాయబారం సాగిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. 

మూడు జాబితాలు వచ్చినా ఖరారు కాని అభ్యర్థులు
ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసింది. రెండో జాబితాలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. నాలుగో జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ఆ జాబితాలో  పాలకుర్తి అభ్యర్థిని ప్రకటించారు. జనగామ, స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. జిల్లా కేంద్రమైన జనగామను తాత్కాలికంగా పక్కన పెట్టడంతో రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోంది. 

కూటమి టికెట్లు ఖరారయ్యే వరకు వెయిటింగ్‌..
ఒంటరి పోరుతో బరిలోకి దిగుతున్న బీజేపీ అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కూటమిలో భాగంగా పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. అయితే స్టేషన్‌ఘన్‌పూర్‌ స్థానాన్ని టీజేఎస్‌కూడా వారు పోటీచేసే స్థానాల్లో ప్రకటించారు. పాలకుర్తిలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి బిల్లా సుధీర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. జనగామలోనూ మహాకూటమి అభ్యర్థి ఇంకా ఫైనల్‌ కాలేదు. ఈ నేపథ్యంలో కూటమిలో టికెట్ల కేటాయింపు పూర్తయ్యే వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. కూటమిలో సీట్లు సర్దుబాటు, టికెట్‌ ఆశించి భంగపడిన నాయకుల మనోగతం తెలుసుకునే వరకు ఆగుదామని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. 

పాగా కోసం ప్రయత్నాలు..
అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకొని పాగా వేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మానుకోట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ హుస్సేన్‌నాయక్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్‌ కేటాయించారు. ఇతర నియోజకవర్గాల్లోనూ పోటీచేయాలని ఆసక్తి చూపుతున్న అసంతృప్తులను పార్టీలోకి తీసుకువచ్చి బలపడాలని బీజేపీ భావిస్తోంది. నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను పార్టీ నుంచి పోటీచేయిస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆలోచిస్తున్నారు.

ఇప్పటికే కొందరు నేతలతో రాష్ట్ర పార్టీ నాయకులు టచ్‌లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. మీ పార్టీలో టికెట్‌ రాకపోతే మేమున్నాం అంటూ భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. జనగామ నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీఎల్‌ఎన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇతర పార్టీలోని అసంతృప్తులకు పార్టీ తరుఫున టికెట్‌ ఇస్తే తనకు అభ్యంతరం లేదని సదరు నాయకుడు పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు చర్చ జరుగుతుంది. పాలకుర్తిలోనూ ఇదే పాచిక వేయాలని భావిస్తున్నారు. బీజేపీ కొత్త ప్లాన్‌ ఏమేరకు సక్సెస్‌ అవుతుందో వేచి చూడాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top