బీజేపీయే ప్రత్యామ్నాయం: స్మృతి ఇరానీ

BJP Is Alternative Party In Telangana Said by Smriti Irani - Sakshi

 అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం

 రాహుల్‌కు శనగకు, వేరుశనగకు తేడా తెలియదు

టీఆర్‌ఎస్‌ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోంది

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు

సాక్షి, డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. టీఆర్‌ఎస్‌ సర్కారు స్వార్థ రాజకీయాల కోసమే పని చేస్తోందని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ యంత్రంలో ఆలుగడ్డలు వేసి బంగారం తీస్తానని చెబుతున్నారని, శనగకు, వేరు శనగకు తేడా తెలియని వ్యక్తికి రైతు సంక్షేమం ఏం తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

అలాంటి వ్యక్తి రాజనీతి గురించి మనం మాట్లాడుకుని ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బీజేపీ రూరల్‌ అభ్యర్థి గడ్డం (కేశ్‌పల్లి) ఆనంద్‌రెడ్డికి మద్దతుగా డిచ్‌పల్లిలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లాది నిధులు అందజేసిందన్నారు. ఎయిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ కోసం రూ.1200 కోట్లు మంజూరు చేసిందని, కానీ, టీఆర్‌ఎస్‌ సర్కారు స్థలం కేటాయించకుండా తీవ్ర జాప్యం చేస్తూ పేదలకు నాణ్యమైన ఉచిత కార్పొరేట్‌ వైద్య సేవలందకుండా అన్యాయం చేస్తోందని విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఆయుష్మాన్‌భవ పథకం అమలు చేస్తోందని, కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పథకంలో చేరకుండా పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేరేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గ్రామీణ పేద ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం 2.03 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం తెలంగాణలో 44 వ్యవసాయ మార్కెట్‌లను ఈ–నామ్‌ మార్కెట్‌లుగా మార్చారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.55వేల కోట్లు రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. ఉపాధి హామీ పనులను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంపు చేశారని తెలిపారు. మీ బిడ్డల భవిష్యత్‌ కోసం, మార్పుకోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.  తెలంగాణ గడ్డపై అడుగు పెట్టగానే గుర్తు కొచ్చేది స్వరాష్ట్రం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులేనని స్మృతిఇరానీ గుర్తు చేశారు. అమర వీరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డిని స్మరించుకుంటూ ఆయన కుమారుడు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డికి మీ సంపూర్ణ మద్దతు తెలుపాలని కోరారు. 

అధికారంలోకి వస్తే.. 

తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. 7 నుంచి 10వ తరగతి చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్లు, ఉన్నత విద్య చదివే విద్యార్థినులకు 50 శాతం సబ్సిడీపై స్కూటీలు అందజేస్తామని, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చదవే విద్యార్థులందరికీ ఉచితంగా లాప్‌టాప్‌లు అందజేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ప్రతి రైతు కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా, ఆరోగ్య బీమా అమలు చేస్తామని చెప్పారు. రైతుల వ్యవసాయ భూమిలో ఉచిత బోరుబావి లేదా బావి తవ్వించి సాగునీరందించేందుకు కృషి చేస్తామన్నారు. ఒక్కో అమర వీరుల కుటుంబానికి రూ.10లక్షలు, ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన వారికి రూ.5లక్షల చొప్పున అందజేస్తామని తెలిపారు.  

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని బీజేపీ రూరల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ఆనంద్‌రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ఇందిరారెడ్డి, కావ్యరెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, గీతారెడ్డి, కల్పన, అమృతలతారెడ్డి, గడ్డం లక్ష్మికాంతమ్మ తదితరులు ఘనంగా సన్మానించారు. బహిరంగ సభకు రూరల్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, రైతులు ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల్లో తరలివచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top