వైఎస్సార్‌ హయాంలోనూ ‘ప్రక్షాళన’

bhattivikramarka about Land records cleansing - Sakshi

టీఆర్‌ఎస్‌ సర్కారు తొలిసారి చేపట్టిన ప్రక్రియ కాదు

భూ రికార్డుల ప్రక్షాళనపై అసెంబ్లీ చర్చలో భట్టి విక్రమార్క

ఆయన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ అభ్యంతరం

సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపణ

సాక్షి, హైదరాబాద్‌: భూ రికార్డుల ప్రక్షాళనను తామే తొలిసారి చేపట్టామంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారంతో గొప్పలు పోతోందని కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చలో భట్టి మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన అనేది 1540–45 నాటి షేర్షా కాలం మొదలుకొని వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హయాం వరకు నిరంతర ప్రక్రియగా జరిగిందన్నారు.

అత్యధిక శాతం భూ రికార్డులు అప్పడే పరిష్కారమయ్యాయని, ఇంకో 10 శాతం సమస్యలు ఉంటే వాటిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. విషయ పరిజ్ఞానం లేని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను రైతు సమన్వయ కమిటీలలో సభ్యులుగా తీసుకుంటున్నారని, వాళ్లు భూ రికార్డుల ప్రక్షాళనలో ఏం చేస్తారంటూ విక్రమార్క మాట్లాడుతుండగా .. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకుంటూ భట్టి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

విపక్ష సభ్యుడు అసత్యాలతో సభను తప్పుదారి పట్టిస్తున్నారని ఆక్షేపించారు. ఆయన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. రైతు సమన్వయ సమితికి , భూ రికార్డుల ప్రక్షాళనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి సూచనలను పరిగణనలోకి తీసుకొని తన అభిప్రాయాలను స్పష్టం చేస్తానంటూ తన వాదన మొదలుపెట్టిన భట్టి... ఈ పర్యాయంలోనే 100 శాతం భూ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం సభకు హామీ ఇవ్వగలరా? అంటూ ప్రశ్నిస్తూనే ‘ఇవ్వలేరు’అని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం జోక్యం చేసుకుంటూ తన సమాధానాన్ని కూడా విపక్ష సభ్యుడే ఎలా చెబుతారని, ఇది సభా మర్యాద కాదని వ్యాఖ్యానించారు.

గిరిజనులకు వైఎస్‌ అటవీ భూములపై హక్కులు కల్పిస్తే...
అనంతరం మళ్లీ చర్చ కొనసాగించిన భట్టి...భూ సమస్యలపై నక్సలైట్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని 2004లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి నక్సలైట్లను చర్చలకు పిలిచారని చెప్పారు. అందరి అభిప్రాయాలు స్వీకరించాక భూ రికార్డుల ప్రక్షాళన కోసం కోనేరు రంగారావు కమిటీని వేశారని, ఆ కమిటీ చేసిన 104 సూచనల్లో 93 సూచనలను ఆమోదించారని సభకు గుర్తుచేశారు.

అటవీ భూములను సాగు చేసుకునే గిరిజనుల కోసం వైఎస్సార్‌ అటవీ హక్కు చట్టం తీసుకొచ్చి లక్షల ఎకరాలపై గిరిజనులకు హక్కులు కల్పించి వారికి పట్టాలు చేశారన్నారు. కానీ కేసీఆర్‌ ప్రభు త్వం హరితహారం పేరుతో, మరో పేరుతో దళిత, గిరిజనుల అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకుంటోందని ఆరోపించారు. అయితే భట్టి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ మరోసారి అభ్యంతరం తెలుపుతూ అసైన్డ్‌ భూములను ప్రభుత్వం ఎక్కడ లాక్కున్నదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హర్షించాల్సింది పోయి వ్యతిరేకించడమా?
అసైన్డ్‌ భూములను లాక్కున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య చరిత్రను త్వరలోనే సభాసంఘం తేల్చబోతోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్‌రెడ్డి అమ్మిన భూములకు ఇప్పటి వరకు రికార్డు లేదని, అప్పుడు సాదా బైనామాతో సర్వే నంబర్‌ 223లో 1.31 ఎకరాలను గిరిజన వ్యక్తి ధరావత్‌ హన్మంత్‌ నాయక్‌కు అమ్మారని సీఎం చెప్పారు.

మొన్నటి సర్వే సమయంలో హన్మంత్‌ నాయక్‌ అధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్లగా రెవెన్యూ అధికారులు ఉత్తమ్‌ను సంప్రదించి విషయాన్ని తెలియజేశారన్నారు. హన్మంత్‌ పేర పట్టా చేసేందుకు ఉత్తమ్‌ కూడా అంగీకరించడంతో నాటి పని మొన్న పూర్తి అయిందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనను కాంగ్రెస్‌ పార్టీ హర్షించాల్సింది పోయి వ్యతిరేకించడం తగదని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top