వామనావతారంలో భద్రాద్రి రాముడు

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి శనివారం ఉదయం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధ్యయనోత్సవాలలో భాగంగా వామనావతారంలో దర్శనమిచ్చిన స్వామి వారిని దర్శించుకోవటానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వామనావతారంలో అలంకరింపజేసిన స్వామి వారిని తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడామండపానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామి వారిని ఆశీనులను చేసి వేద పండితులు నాళాయార్‌ దివ్యప్రబంధాలు చదివారు. స్వామి వారిని మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియంకు తీసుకొచ్చారు. అక్కడినుంచి వేద విద్యార్థుల మంత్రోచ్ఛారణలు, ఆలయ ఆస్థాన విద్వాంసుల నాదస్వరాలు, మహిళల కోలాటాల నడుమ తాతగుడి వరకు తిరువీధి సేవ సాగింది. దారి పొడవునా భక్తులు స్వామి వారికి పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, ఏఈవో శ్రావణ్‌కుమార్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, పర్యవేక్షకులు పోతుల శ్రీను, భవానీరామకృష్ణ, పీఏ టు సీసీ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

నేడు  పరశురామావతారం
వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఆదివారం పరశురామావతారంలో దర్శినమిస్తారు. శ్రీ మహావిష్ణువు జమదగ్ని అనే మహర్షికి కొడుకుగా జన్మించి పరశురాముడు (భార్గవరాముడు) అని పిలవబడుతూ దుష్టులైన కార్తవీర్యార్జునుని, దుర్మార్గులైన రాజులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. శుక్ర గ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించటం వల్ల శుభపలితాలు పొందుతారని ప్రతీతి.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top