‘పంటల మార్పిడికి బీజేపీ వ్యతిరేకం కాదు’

Bandi Sanjay Slams On KCR And TRS Government In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని, అందుకే చెప్పిన పంటనే వేయాలని రైతులకు ఆంక్షలు పెడుతోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. 2017 నుంచి రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎక్కడ అయిందో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ నెంబర్‌వన్ అనేది అవాస్తవమని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయిని, అప్పుడే ఎఫ్‌సీఐ ఎలా ప్రకటన చేసిందో చెప్పాలన్నారు. రైతులను బెదిరించి, భయపెట్టి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులకు కేసీఆర్ కారణం అవుతున్నారని మండిపడ్డారు. విత్తనాలు, ఎరువుల వల్ల రైతులు నష్టపోతే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

రాష్ట్రంలో పంటల గురించి భూసార పరీక్షలు  చేయకుండా చెప్పిన పంటనే వేయాలని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు. మద్దతు ధర చెప్పిన తరువాత చెప్పిన పంట వేయాలనే నియంత్రణ తేవాలన్నారు. పంటల మార్పిడికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇస్తానని గతంలో కేసీఆర్ చెప్పినట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎకరానికి పెట్టుబడి పోగా రూ. 10 వేల కంటే ఎక్కువ రావని, మరి రూ. లక్ష పంట రావాలని ఎలా చెబుతారో వివరణ ఇవ్వాలన్నారు. ఎఫ్‌సీఐ చైర్మన్‌కి కేసీఆర్‌కి ఏమైనా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయేమోనని ఆరోపించారు. అన్ని కేంద్రమే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. నియంత్రణ వ్యవసాయంపై ప్రభుత్వం మార్గదర్శకలను విడుదల చేయాలన్నారు. రైతులకు అన్యాయం చేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వం మెడలు వంచడానికి మా కార్యాచరణ ఉంటుందని బండి సంజయ్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top