‘ముంపు ప్రాంతాల విలీనం’పై భగ్గు


సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. జన జీవనం స్తంభించిపోయింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, పరిశ్రమలను స్వచ్ఛందంగా మూసివేశారు.

 

 సాయంత్రం వరకూ అత్యవసర సర్వీసులు తప్ప మిగతా అన్ని సంస్థలనూ మూసివేశారు. సీపీఎం, సీపీఐలు కూడా బందులో పాల్గొన్నాయి. అన్ని డిపోల్లోని 638 బస్సులు బయటకు రాలేదు. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని బస్సు డిపో ఎదుట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు బైఠాయించారు.

 

 వీరికి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మద్దతు పలకడంతో డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లలేదు. జోగిపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు రెండు గ్రూపులు(ఎమ్మెల్యే బాబూమోహన్, నియోజకవర్గం ఇన్‌చార్జి కిష్టయ్య)గా విడిపోయి ఎవరికి వారుగా బందులో పాల్గొన్నారు. వేర్వేరుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. కాగా మొదటి నుంచీ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనే అపవాదును మూటగట్టుకున్న ఎమ్మెల్యే బాబూమోహన్ ఈ సారి కూడా దూరంగానే ఉన్నారు.

 

 దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మధన్‌రెడ్డి అధ్వర్యంలో బంద్ కార్యక్రమం చేపట్టారు. పై నియోజవర్గాల్లో కూడా డిపోల్లోంచి ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు. కొల్చారం మండలం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో బంద్  జరిగింది.

 

 టీఆర్‌ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరగగా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో పాక్షికంగా కనిపించింది. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఉదయం 5 గంటలకే బస్ డిపో ఎదుట బైఠాయించారు. సాయంత్రం వరకు ఒక్క బస్సునూ కదలనివ్వలేదు. పాపన్నపేటలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు, వెంకయ్య నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీళ్లద్దరి కుట్రల వల్లే పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రలో కలిపారని టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top