ప్చ్‌..వీళ్లింతే!

Baldia Completes Three Years Service - Sakshi

ప్రజల మన్ననలు పొందని కార్పొరేటర్లు

ప్రజా సమస్యలకంటే కాసులపైనే కొందరి కన్ను..

అక్రమ దందాలు, అడ్డగోలు వసూళ్లు

అడుగడుగునా అప్రతిష్టపాలు  

బల్దియా పాలకమండలికి నేటితో మూడేళ్లు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పాలక మండలికి సోమవారంతో ముచ్చటగా మూడేళ్లు. సుదీర్ఘకాలం స్పెషలాఫీసర్‌ పాలన అనంతరం ఏర్పాటైన కొత్త పాలకమండలితో తమ సమస్యలు పరిష్కారమవుతాయని నగరవాసులు ఆశించారు. కార్పొరేటర్లుగా ఎన్నికైనవారిలో యువత, విద్యాధికులు అధికంగా ఉండటంతో నూతనోత్సాహంతో పనిచేస్తారని భావించారు. పురుషుల కంటే మహిళా కార్పొరేటర్లు అధికంగా ఉండటంతో నీతివంతమైన పాలన అందగలదని అంచనా వేశారు. కానీ, మూడేళ్లలో నగర వాస్తుల అంచనాలు తలకిందులయ్యాయి.  కానీ..పదవిలోకి వచ్చింది మొదలు కొందరి అక్రమాలు, అనైతిక కార్యకలాపాలు వెలుగులోకి చూశాయి. కొందరు ఏకంగా దాడులు..దౌర్జన్యాలకూ వెనుకాడలేదు.

కొందరు మహిళా కార్పొరేటర్ల  భర్తలు డివిజన్లల్లో రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యారు. ఎక్కడైనా ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయంటే..తమ వాటా ఇవ్వాల్సిందేనంటూ బిల్డర్లకు  బెదిరింపులు, బేరాలు సర్వసాధారణంగా మారాయి. మామూళ్లు అందిస్తే చాలు..అనుమతి లేని అక్రమ భవన నిర్మాణాలకు అండదండలు అందించడం, అడ్డుకుంటే అధికారులపై దాడులు, ఫిర్యాదు చేయడం పరిపాటిగా తయారైంది. ల్యాండ్,  ప్రైవేట్‌ పంచాయతీలు, కుటుంబ తగాదాల్లో జోక్యాలకు సైతం కొందరు కార్పొరేటర్లు వెనుకాడటం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక నగర శివారు ప్రాంతాల్లో కొందరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 

సమస్యలపై దృష్టేది?
నగర కార్పొరేటర్లకు ప్రజా సమస్యలపై శ్రద్ధ లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా మంది కార్పొరేటర్లు ప్రజలతో సంబంధాలు మరిచిపోయారు. అపార్ట్‌మెంట్ల విజిట్స్, డివిజన్‌ సందర్శన నామమాత్రంగా మారిది. అక్రమ సంపాదనపై ఉన్న శ్రద్ధ ప్రజల మౌలిక వసతులపై చూపడం లేదు. దీంతో గతంలో మున్నెన్నడూ లేని విధంగా పాలకమండలికి చెడ్డ పేరువస్తోంది. కొందరి చేష్టలతో అందరికీ మరకలంటుకుంటున్నాయి.

ప్రశ్నించే వారేరి...?
ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం లేకుంటే ఎలాంటి పరిణామాలుంటాయో  తెలిపేందుకు జీహెచ్‌ఎంసీ మంచి ఉదాహరణ. అధికార టీఆర్‌ఎస్‌ తోపాటు ఎంఐఎం కూడా దానికి మిత్రపక్షంగానే ఉండటంతో, ప్రతిపక్ష సభ్యులంతా కలిసి కూడా పదిమంది లేరు. దీంతో అధికార పక్షం సభ్యులు ఆడింది ఆటగా సాగుతోంది. కనీసం తప్పులను ఎండగట్టేవారు లేకుండా పోయారు. జనరల్‌ బాడీ, స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు  మొక్కుబడి తంతుగా జరుగుతున్నాయి.  తాము కావాలనుకున్నవాటిని సభ ముందుంచి మమ అనిపిస్తున్నారు. సమావేశాల ఉద్దేశం, లక్ష్యం పక్కదారి పట్టాయి. ఎక్కడా ప్రతిపక్షం లేకపోవడంతో ఇష్టారాజ్యం సాగుతోంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అజెండాలో సైతం పూర్తి వివరాలు తెలపకుండా పలు కీలకాంశాల్లో హడావుడిగా టేబుల్‌అజెండాగా సమావేశం ముందుంచి ఆమోదం తెలపడం పరిపాటిగా  మారింది. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం ప్రతిమూడు నెలలకోమారు సాధారణ సర్వసభ్య సమావేశాలు జరగాల్సి ఉండగా, మూడేళ్లలో 10 సాధారణసర్వసభ్య సమావేశాలు మాత్రమే జరిగాయి. ఏరియా, వార్డు కమిటీల ఎన్నిక, బడ్జెట్‌ వంటి  ప్రత్యేక సమావేశాలు  పది జరిగాయి.  ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ  మేరకు అమలయ్యాయో తదుపరి సమావేశంలో సమీక్షల్లేవు. ఇక వార్డు, ఏరియా కమిటీలు పనిచేయడం లేదు. క్షేత్రస్థాయిలో పారిశుధ్యం, రహదారులు, వీధిదీపాలు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పార్కుల నిర్వహణ, మార్కెట్లు, ఆటస్థలాల నిర్వహణ వంటి ప్రజా సమస్యలను వార్డు, ఏరియా కమిటీల సమావేశాల్లో ప్రతిపాదించి కార్పొరేషన్‌కు పంపితే, అవసరమైన నిధులు మంజూరు చేయాలి. వార్డు కమిటీలు రెండు నెలలకోమారు సమావేశం కావాలి. ఆయా విభాగాల అధికారులు హాజరు కావాలి. సమస్యలు పరిష్కరించని పక్షంలో అందుకు సమాధానం చెప్పాలి.  వాటి ఏర్పాటుకే ఏడాదిన్నరకు పైగా పట్టింది. సమావేశాలంటూ జరిగిన దాఖలాల్లేవు.

కార్పొరేటర్లకు బడ్జెట్‌ నిల్‌..
కార్పొరేటర్లు మూడేళ్లుగా తమకు కూడా బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేయడం, రథసారథి దానిని దాటేయడం పరిపాటిగా తయారైంది. వాస్తవంగా గత పాలకమండలిలో శివార్లలోని కార్పొరేటర్లకు రూ.2 కోట్లు, కోర్‌ సిటీ పరిధిలోని కార్పొరేటర్లకు రూ.1.5 కోట్ల  వంతున కార్పొరేటర్‌ బడ్జెట్‌ ఉండేది. ఈ నిధులతో తమ డివిజన్‌లో అభివృద్ధి పనులు చేయించుకునే వీలుండేది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులన్నింటికీ జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వమే నిధులిస్తున్నందున, ఇక కార్పొరేటర్లకంటూ ప్రత్యేక బడ్జెట్‌ లేకుండా పోయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top