బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్ట్‌

Arrested  The Accused In Sexual Assault Case - Sakshi

కరీంనగర్‌కు మరో కేసు బదిలీ

అనాథ పిల్లల ఆశ్రమాలపై నిఘా

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

ఏసీపీ రక్షిత కె.మూర్తి

కోల్‌సిటీ(రామగుండం) కరీంనగర్‌ : గోదావరిఖనిలోని ఆదరణ పిల్లల ఆశ్రమంలో బాలిక(11)పై లైంగికదాడికి పాల్పడిన ఆశ్రమ నిర్వాహకురాలి అల్లుడు వీరమాచినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేసినట్లు, గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి తెలిపారు. బుధవారం స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. కరీంనగర్‌జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలిక(11) తల్లిదండ్రులు నాలుగేళ్లక్రితం చనిపోయారు. దీంతో బాలికను ఆమె పెద్దమ్మ రాధ మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలోని ఓ స్కూల్, హాస్టల్‌లో చేర్పించింది.

అక్కడే ఐదోతరగతి వరకు చదివింది. ఈ ఏడాది వేసవి సెలవుల్లో బాలికను పెద్దమ్మ రాధ వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ రాధ సోదరుడు ప్రకాష్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం బయటకు తెయకూడదని ఈ ఏడాది జూన్‌లో, గోదావరిఖనిలోని నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో ఆమె పెద్దమ్మ బాలికను 6వ తరగతిలో చేర్పించింది. ఆశ్రమంలో బాలికకు కేటాయించిన గదిలో ఉన్నప్పుడు ఆశ్రమ నిర్వాహకురాలు వెంకటలక్ష్మీ అల్లుడు వీరమాచినేని శ్రీనివాసరావు లైంగికదాడి చేశాడు.

ఈ విషయాన్ని శ్రీనివాసరావు భార్య అర్చనతోపాటు ఆశ్రమ నిర్వాహకురాలు వెంకటలక్ష్మీకి బాధితురాలు తెలిపింది. దీంతో బాలికను కులం పేరుతో దూషించడమే కాకుండా కొట్టి, మందమర్రిలోని ఆశ్రమంలో చేర్పించారు. విషయాన్ని హాస్టల్‌ నిర్వాహకురాలికి చెప్పడంతో, బాధితురాలి బంధువులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. బుధవారం స్థానిక జీఎం కాలనీలో వీరమాచినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

ఈ కేసులో మరో ఇద్దరు నిందితులపై కూడా విచారణ కొనసాగుతోందని, రాధతోపాటు ప్రకాష్, అయన భార్యపై కేసు నమోదు చేసి, ఈ కేసును కరీంనగర్‌ జిల్లాకు బదిలీ చేసినట్లు తెలిపారు.  అయితే నగరలోని ఆశ్రమాలపై నిఘాపెట్టినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐలు వాసుదేవరావు, మహేందర్, ఏఎస్సై శారద తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top