హై అలెర్ట్‌!

Anjani Kumar Reviews Elections Meetings in Hyderabad - Sakshi

ఎన్నికలకు సిద్ధమైన సిటీ పోలీసులు  

తుది ఘట్టానికి చేరుకున్న ప్రచారం

ఆది, సోమవారాల్లో నగరంలో కీలక ఘట్టాలు

పరేడ్‌గ్రౌండ్స్‌లో సీఎం, ఎల్బీస్టేడియంలో పీఎం సభలు  

ఏర్పాట్లను సమీక్షించిన కొత్వాల్‌ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో నగర పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఓపక్క పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మరోపక్క వరుసగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నిర్వహించనున్న బహిరంగ సభలకు సిటీ వేదిక కానుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు విభాగం అత్యంత పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. వీటిని స్వయంగా సమీక్షిస్తున్న నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ శుక్రవారం సభలు జరిగే పరేడ్‌ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియాలను సందర్శించారు. అక్కడ చేస్తున్న, చేయనున్న ఏర్పాట్లను సమీక్షించిన ఆయన.. సిబ్బందికి కొన్ని కీలక సూచనలు చేశారు. అసెంబ్లీని రద్దు చేసిననాటి నుంచి పోలీసు విభాగం క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, నోటిఫికేషన్‌ జారీ తర్వాత పరిస్థితి మరింత అప్రమత్తంగా మారింది. అనేక మంది ప్రముఖులు, వీవీఐపీలు వచ్చి వెళ్తుండడంతో అనునిత్యం బందోబస్తు, భద్రతా ఏర్పాట్లలో తలమునకలైంది.

ఇక ప్రచార పర్వం తుది దశకు రావడంతో వేడి మరింత పెరిగింది. ఆదివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, సోమవారం ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీల భారీ ప్రచార బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటున్న సిటీ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సభ కోసం 3 వేల మందిని, పీఎం సభకు ప్రత్యేకంగా 4 వేల మందిని అదనంగా మోహరిస్తున్నారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) బృందాలు ఇప్పటికే సిటీకి చేరుకున్నాయి. ఎల్బీ స్టేడియాన్ని శనివారం తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. మరోపక్క పోలీసులు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు పెంచారు. లాడ్జిలతో పాటు అనుమానిత ప్రాంతాలపై నిఘా పెంచారు. పరేడ్‌గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియంలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. ఆయా రోజుల్లో పరేడ్‌గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియం చుట్ట పక్కల ట్రాఫిక్‌ మళ్లిపులు విధించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top