జోరుగా మద్యం అమ్మకాలు

Alcohol Sales Rises in Hyderabad - Sakshi

30 శాతం పెరిగిన మద్యం విక్రయాలు

జూలై 16 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా

14,82,567 కార్టన్ల మద్యం అమ్మకం

గత ఏడాది 12,72,276 కార్టన్ల విక్రయం

హైదరాబాద్‌లో కాస్ట్‌లీ బ్రాండ్లపై మక్కువ

జిల్లాలో సెమి ప్రీమియం బ్రాండ్ల వైపు మెగ్గు  

సాక్షి సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరు మీద ఉన్నాయి. జూన్‌ నెల వరకు ఎండలు అధికంగా ఉండటంతో మద్యం ప్రియులు బీర్లు తాగి ఉప శమనం పొందడంతో బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి, జూలై నెలలో వర్షాలు కరుస్తుండటం, వాతావరణం చల్లబడటంతో మందు బాబులు లిక్కర్‌పై ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే మద్యం అమ్మకాలు 30 శాతం పెరిగాయి .  రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోతుండటంతో ప్రభుత్వానికి  ఆదాయం అదే స్థాయిలో సమకూరుతోంది.  ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ (ఐఎంఎఫ్‌ఎల్‌) గణాంకాల ప్రకారం గడిచిన ఏడాదితో పోలిస్తే ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. 2018 జూలై నెలలో 16 నాటికి రూ. 744 కోట్ల ఆదాయం రాగా, 2019 జూలై నెలలో 16 అదే సమయానికి రూ. 907 కోట్ల ఆదాయం వచ్చింది.  

లిక్కర్‌పైనే మక్కువ...
వర్షాకాలం ప్రారంభం కావడంతో మందు బాబులు విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కాపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు ఐఎంఎఫ్‌ఎల్‌ లెక్కల్లో తేలింది.  2019 జూలై 16 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 14,82,567 కార్టన్ల లిక్కర్‌ అమ్ముడుపోగా గడిచిన ఏడాది 12,72,276 కార్టన్ల లిక్కర్‌ అమ్ముడు పోయింది. అంటే గడిచిన ఏడాదితో పోలిస్తే 16 రోజుల్లోనే 2,10,291 బాక్సుల లిక్కర్‌ అధికంగా అమ్ముడైనట్లు సమాచారం.  

ఏప్రెల్‌లో ఏరులు...
గత ఏప్రిల్‌ నెలలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్‌ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.  2018 ఏప్రిల్‌ నెలలో 20,75,065 బాక్సుల మద్యం విక్రయాలు జరుగ్గా, 2019 ఏప్రిల్‌ నెలలో 27, 43, 915 బాక్సుల మద్యం అమ్ముడు పోయింది. అంటే ఒక్క నెలలోనే 6,68,850 బాక్సుల లిక్కర్‌ అధికంగా అమ్ముడుపోయింది.  

 ఖరీదైన మద్యంపై నగరవాసుల ఆసక్తి...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో సంపాదన అధికంగా ఉన్న వారంతా  ఖరీదైన మద్యం తాగేందుకే ఆసక్తి చూపుతున్నారు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, మద్యం సేవించే అలవాటు ఉన్న ఐటీ ఉద్యోగులు, యువత ఎక్కువ శాతం కాస్ట్‌లీ మద్యం తాగేందుకే ఆసక్తి చూపుతున్నట్లు ఐఎంఎఫ్‌ఎల్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే జిల్లాల్లో ఇందుకు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మద్యం ప్రియులు సెమీ–ప్రీమియం బ్రాండ్లపైనే ఆసక్తి చూపుతున్నారు. ఐఎంఎఫ్‌ఎల్‌ లెక్కల ప్రకారం రాయల్‌ స్టాగ్, మెక్‌ డోవెల్‌ (ఎంసీ) ఆఫీసర్స్‌ ఛాయిస్‌ జిల్లాల్లో మద్యం ప్రియులకు హాట్‌ ఫేవరేట్‌గా ఉన్నాయి. వీటి అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top