ఆ కిక్కే వేరప్పా

Alcohol Policy Change This Year And Hike Prices - Sakshi

సెప్టెంబర్‌తో ముగియనున్న ప్రస్తుత పాలసీ

నూతన పాలసీలో లైసెన్సు ఫీజు పెంపు!  

కొత్త కార్పొరేషన్లతో మరింత ఆదాయం

అదనపు దుకాణాల ఏర్పాటుపైనా దృష్టి

మరింత ప్రియం కానున్న మద్యం

సాక్షి సిటీబ్యూరో: రెండు నెలల్లో ప్రారంభం కానున్న కొత్త మద్యం పాలసీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.  ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను మరింత పెంచడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల లైసెన్స్‌ ఫీజును పెంచడంతో పాటుకొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో దుకాణాల సంఖ్యను సైతం పెంచే దిశగా ప్రయత్నాలు చేపట్టారు. 2017 అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమైన ప్రస్తుత పాలసీ.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 31తో ముగిసి అక్టోబర్‌ 1 నుంచి కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రారంభమవుతుంది. పాత పాలసీకి రెండు నెలలే సమయం ఉండడంతో ప్రభుత్వం అగస్టులో కొత్త పాలసీకి సంబంధించిన నిర్ణయాలు, విధివిధానాలను ప్రకటించనుంది. ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రభుత్వం సన్నాహాకాలు చేపడుటుతుండడంతో కొత్త ఎక్సైజ్‌ పాలసీలో ఫీజులు ఎలా ఉంటాయానే ఉత్కంఠ మద్యం వ్యాపారుల్లో నెలకొంది. 

ఏటా పెరుగుతున్న అమ్మకాలు
హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 199 మద్యం దుకాణాలు, 147 బార్లు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్‌ పరిధిలో 412 మద్యం దుకాణాలు, 405 బార్లు ఉన్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌ జిల్లాలో రూ.2,314 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. 2018–19లో రూ.2,588 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఏడాదిలో 11.9 శాతం అమ్మకాలు పెరిగాయి. అదే విధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2017–18లో రూ.4,255 కోట్ల వ్యాపారం జరగ్గా.. 2018–19లో రూ.5234 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇక్కడా ఏడాదిలో 23 శాతం మేర మద్యం అమ్మకాలు పెరిగాయి. దీనిప్రకారం ప్రతి ఏటా మద్యం అమ్మకాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ హైదరాబాద్‌ జిల్లాలో రూ.7 కోట్లు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.14 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది.  

ఈసారి పెంపు తప్పదా!
గతంలో ప్రభుత్వం మద్యం దుకాణాలకు బహిరంగంగా వేలం వేసేది. ఇందులో పాల్గొన్న మద్యం వ్యాపారులు ఎవరు ఎక్కువ పాడితే వారికే దుకాణం దక్కేది. కానీ ఈ పాలసీ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రభుత్వమే ముందుగా దుకాణం ధరను నిర్ణయించి లక్కీడిప్‌ ద్వారా కేటాయిచే పాలసీని తీసుకువచ్చారు. 2019 అక్టోబర్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఎక్సైజ్‌ పాలసీలోనూ పెద్దగా మార్పులు లేకపోయినా లైసెన్స్‌ ఫీజు మాత్రం పెంచుతారని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం గ్రేటర్‌ పరిధిలోని ఒక్కో దుకాణానికి ఏడాదికి రూ.1.8 కోట్ల ధరను నిర్ణయించగా రెండేళ్లకు రూ.2.16 కోట్లుగా వ్యాపారుల నుంచి వసూలు చేశారు. కానీ కొత్త పాలసీలో ఈ ధర మరింత పెరిగే అవకాశముంది. అధిక ధర వెచ్చించి దుకాణం దక్కించుకున్న వ్యాపారులకు ఆదాయం రావాలంటే మద్యం ధరను పెంచక తప్పదు.  

దుకాణాల సంఖ్య పెంపు
గ్రేటర్‌ శివార్లలో కొత్త కార్పొరేషన్లు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పడిన నేపధ్యంలో పాలసీలో మార్పులు వచ్చే అవకాశం ఉందని కొందరు ఎక్సైజ్‌ శాఖ అధికారులు అంటున్నారు. రెండేళ్ల క్రితం మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న దుకాణాలకు ఏడాదికి లైసెన్స్‌ ఫీజు రూ.45 లక్షలుగా నిర్ణయించారు. కానీ ప్రస్తుతం అవి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో లైసెన్స్‌ ఫీజు భారీగా పెరగనుంది. దీంతో పాటు దుకాణాల సంఖ్యను కూడా పెంచనున్నారు. దీనిద్వారా ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరే అవకాశముంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top