ప్రీమియం లిక్కర్‌కే ఓటు

Alcohol Lovers Likes Costly Wine in Hyderabad - Sakshi

ఆర్డినరీ బ్రాండ్ల వైపు చూడని మందుబాబులు

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మందు బాబులు ప్రీమియం బ్రాండ్ల మద్యం తాగేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆర్డినరీ, మీడియం బ్రాండ్ల అమ్మకాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ప్రీమియం బ్రాండ్ల మద్యం అధికంగా అమ్ముడుపోతున్నట్టు ఆబ్కారీ గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలతో మద్యం అమ్మకాలు మరింతగా పెరిగాయి. అయినప్పటికీ ఆర్డినరీ బ్రాండ్ల అమ్మకాలు పెరుగలేదు. దీన్నిబట్టి చూస్తే ఎన్నికల్లోను పోటీలో ఉన్న అభ్యర్థులు మందు బాబులను ప్రసన్నం చేసుకునేందుకు కూడా మీడియం, ప్రీమియం బ్రాండ్ల వైపే మెగ్గు చూపారనేది స్పష్టం అవుతోంది. దీనికి తోడు వీకెండ్‌ రోజుల్లో నగరంలోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పాటు, యువత, ఉద్యోగులు, వ్యాపారం చేసే వారు బార్లు, పబ్‌లలో గడిపే వారు మీడియం బ్రాండ్ల లిక్కర్‌ కాకుండా ప్రీమియం బ్రాండ్ల వైపే ఇష్టం చూపించారు. 

భారీగా ఆదాయం  
ఆర్డినరీ బ్రాండ్ల లిక్కర్‌తో పోలిస్తే ప్రీమియం బ్రాండ్ల లిక్కర్‌ మూడింతల అధికంగా అమ్ముడు అవుతుండటంతో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ప్రీమియం బ్రాండ్ల లిక్కర్‌ అధికంగా అమ్ముడు కావడానికి గల ప్రధాన కారణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా జరుగుతుండటం, ఐటీ ఉద్యోగులు, యువత అధికంగా ప్రీమియం బ్రాండ్ల వైపే మెగ్గు చూపడమేనని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే  గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీనరీ బ్రాండ్ల అమ్మకాలే అధికంగా ఉంటున్నాయి. 

గుడుంబా నియంత్రణతో..
చీప్‌ లిక్కర్‌ అమ్మకాలను పెంచడానికి గుడుంబా తయారీ చేసే వారిపై కేసులు నమోదు చేయడం, బైండోవర్లు, జరిమానాలు విధించడంతో గుడుంబా తయారీ, అమ్మకం చాలా వరకు తగ్గింది. గుడుంబా, కల్తీ కల్లు అమ్ముడుపోయినా ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఉండదనేది తెలిసిందే. దీంతో చాలా మంది చీప్‌ లిక్కర్, ఆర్డినరీ బ్రాండ్ల మద్యానికే ఓటేస్తున్నారు. గుడుంబా, కల్తీ కల్లును కట్టడి చేయడంతో రెండు, మూడు సంవత్సరాల క్రిందితో పోలిస్తే చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు పెరిగిన ట్లేనని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top