భలే డిమాండ్‌ !

alchohol shops demanding hikes this time in district - Sakshi

కొత్త మద్యం వ్యాపారులకు గుడ్‌విల్‌ ఆఫర్లు

ఒక్కో దుకాణానికి రూ.44లక్షల నుంచి రూ.80లక్షలు..

జిల్లావ్యాప్తంగా చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

లక్కీరాయుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లిక్కర్‌ వ్యాపారులు

నల్లగొండ, హుజూర్‌నగర్‌/కోదాడ : జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మద్యం దుకాణాలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లాలో ఇటీవల ప్రభుత్వం లక్కీ డ్రా పద్ధతిన దుకాణాలు కేటాయించింది. అయితే ఈ సారి పాత వ్యాపారుల కంటే కొత్తవారికే ఎక్కువగా మద్యం దుకాణాల లక్కు తలిగింది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారంపై అనుభవం ఉన్నవారు (పాతవారు) ఎలాగైనా దుకాణాలను దక్కించుకునేందుకు లక్కీరాయుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంత డబ్బైనా వెచ్చించి మద్యం దుకాణం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాలో మద్యం వ్యాపారం చర్చనీయాంశంగా మారింది.

పాతవారికి వచ్చిన షాపులు తొమ్మిదే..
ఈ ఏడాది జిల్లాలోని 71 మద్యం దుకాణాలకు గాను అత్యధికంగా  3,043 దరఖాస్తులు రాగా ఈ నెల 22న డ్రా పద్ధతిలో దుకాణాల కేటాయించారు. దీంతో 71 దుకాణాలకు 71 మంది మాత్రమే మద్యం దుకాణాల నిర్వహణ లైసెన్స్‌ను దక్కించుకున్నారు. ఇందులో పాత వారికి కేవలం 9 దుకాణాలు మాత్రమే దక్కాయి. మిగతా 62 దుకాణాలు కొత్తవారికి వచ్చాయి. వీరిలో చాలా మందికి మద్యం వ్యాపారంలో అనుభవం లేదు. మరోపక్క అనేక సంవత్సరాలుగా మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న వారికి ఈ సారి దుకాణాలు దక్కకపోవడంతో  దక్కించుకున్న వారి నుంచి వాటిని కొనేందుకు భారీగా గుడ్‌విల్‌ ఆఫర్‌ చేస్తున్నారు. వివిధ పార్టీల నాయకులతో ఫోన్లు చేయిస్తున్నారు. ముఖ్యంగా రానున్న రెండేళ్లలో స్థానిక, సార్వత్రిక ఎన్నికలుండే అవకాశముండగా మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా విరాజిల్లుతుందని భావిస్తున్న పలువురు వ్యాపారులు మద్యం దుకాణాలు దక్కించుకోవడంపై కన్నేశారు. లక్కీలో షాపులు వచ్చిన కొందరు గుడ్‌ విల్‌ తీసుకొని వాటిని అప్పగిస్తుండగా, మరికొందరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని పార్టనర్‌గా చేర్చుకుంటున్నారు. ఒక్కొక్క షాపుకు రూ.44 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఇచ్చేందుకు వెనుకాడక పోగా ఇప్పటికే పలు దుకాణాలకు ధర నిర్ణయించి చెల్లింపులు జరగగా మరికొన్ని చోట్ల చర్చలు జరుగుతున్నాయి.

రూ.63 లక్షల గుడ్‌విల్‌ పలికిన మునగాల దుకాణం..!
జిల్లాలో సిమెంట్‌ పరిశ్రమలకు నెలవుగా ఉన్న మేళ్లచెరువులోని ఒక మద్యం దుకాణంను రూ.44 లక్షల గుడ్‌విల్‌కు విక్రయించగా, గరిడేపల్లి మండలం కీతవారిగూడెం మద్యం దుకాణంను రూ.48లక్షలకు, హుజూర్‌నగర్‌లోని ఓ దుకాణానికి రూ.40 లక్షలకు ఇప్పటికే విక్రయించారు. ఇదిలాఉంటే కోదాడ మండలం నల్లబండగూడెం, పెన్‌పహాడ్, సూర్యాపేటలోని ఒక మద్యం దుకాణంల విక్రయాలకు చర్చలు జరుగుతున్నాయి. కాగా జిల్లాలోనే రికార్డుస్థాయిలో 146 మంది దరఖాస్తు చేసుకున్న జాన్‌పహాడ్‌ మద్యం దుకాణం కూడా విక్రయానికి సిద్ధమైంది. ఈ మద్యం దుకాణంను దక్కించుకున్న వారు రూ.కోటి గుడ్‌విల్‌కు విక్రయించేందుకు సిద్ధం కాగా కొందరు మద్యం వ్యాపారులు రూ.80లక్షల వరకు గుడ్‌ విల్‌ ఇచ్చేందుకు ముందుకు రాగా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఇక..మునగాల మండల కేంద్రానికి చెందిన ఓ దుకాణాన్ని ఆ మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు రికార్డు స్థాయిలో రూ.63 లక్షల గుడ్‌విల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈయన తన సహచరులతో కలిసి 63 దుకాణాలకు టెండర్‌లు వేసినా ఒక్కటీ దక్కలేదు. సూర్యాపేటలో రెండు దుకాణాలకు కోదాడ, సూర్యాపేటకు చెందిన వారు సిండికేట్‌గా మారి గుడ్‌విల్‌ కింద ఒక్కోదుకాణానికి రూ.42 లక్షల ఇచ్చినట్లు సమాచారం. తుంగతుర్తిలో ఒక దుకాణం గుల్‌విల్‌ తీసుకొని పాతవారికే అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని దుకాణాలకు కూడా పాత వ్యాపారులు భారీగా ఆఫర్లు ఇస్తున్నారు. చాలా చోట్ల దుకాణాలు చేతులు మారుతున్నా.. సమాచారాన్ని మాత్రం బయటకు పొక్కనియ్యడం లేదు. అయితే మద్యం దుకాణం లైసెన్స్‌ పొందిన వ్యక్తి దుకాణాన్ని విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని డబ్బుకు ఆశ పడి దుకాణం విక్రయించినా సదరు దుకాణం నుంచి వచ్చే సమస్యలకు అతనే బాధ్యుడవుతాడని ఎక్సైజ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  

లైసెన్స్‌ మాత్రం వారిపేరు మీదే...
ఇన్ని లక్షల రూపాయల గుడ్‌విల్‌ ముట్టజెపినప్పటికీ మద్యం వ్యాపార లైసెన్స్‌ మాత్రం లాటరీలో దుకాణం దక్కించుకున్న వారి పేరు మీదే జారీ చేస్తామని ఎక్సైజ్‌శాఖ వారు అంటున్నారు. దీంతో గుడ్‌విల్‌ ఇచ్చినవారు పెద్దల సమక్షంలో కాగితాలు రాసుకునే పనిలో పడ్డారు.  

మద్యం ధరలకు రెక్కలు !
మద్యం రేట్లకు రెక్కలొచ్చాయి. పాత దుకాణాలకు ఇక నాలు గు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఉన్న స్టాకు మీద అదనపు రాబడికి వైన్స్‌ యజమానులు ధరలను పెంచి అమ్ముతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే స్టాకే లేదంటున్నారు. దీంతో మద్యం ప్రియులు తప్పని పరిస్థితుల్లో  కొనుగోలు చేస్తున్నారు. కోదాడతో పాటు హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి తదితరప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాల్లో రెండు రోజులుగా క్వార్టర్‌ బాటిల్‌కు రూ.10, ఫుల్‌బాటిల్‌పై రూ.50 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బెల్ట్‌షాపుల నిర్వాహకులు వీటికి మరో రూ.10 చేర్చి అమ్ముతున్నారు. మరో రెండు రోజులు పోతే స్టాక్‌ దొరకదని పుకార్లు వస్తుం డడంతో కొందరు ముందస్తుగా మద్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నారు.  

అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు  
మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా చర్యలు తీసుకుంటాం. మంగళవారం అన్ని దుకాణాలను తనిఖీ చేశాం. ఎక్కవకు అమ్మితే మాకు ఫిర్యాదు చేయవచ్చు. అలాంటి వారిపై వెంటనే చర్యలుంటాయి. దుకాణాలకు గుడ్‌విల్‌ ఇస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. – ఆర్‌.సురేందర్, ఎక్సైజ్‌ సీఐ, కోదాడ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top