కొత్తగూడెం–పాల్వంచ మధ్యలో ఎయిర్‌పోర్ట్‌!

airport between kothagudem-palvancha - Sakshi

సీఎం చేతుల మీదుగా పునాది రాయి

ప్రజల సౌకర్యార్థమే ఖమ్మంలో పాస్‌పోర్ట్‌ కార్యాలయం: ఎంపీ పొంగులేటి 

ఖమ్మం హెడ్‌పోస్టాఫీస్‌లో పాస్‌పోర్ట్‌ కార్యాలయం ప్రారంభం 

 ఖమ్మం వ్యవసాయం: కొత్తగూడెం–పాల్వంచ మధ్యలో త్వరలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానుందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పునాదిరాయి వేయనున్నారని చెప్పారు. మంగళవారం ఖమ్మం హెడ్‌పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు కేంద్రాన్ని ఎంపీ పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయకుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు.

ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వాపార పనులు, యాత్రల కోసం ఈ ప్రాంతం నుంచి విదేశాలకు వెళ్లేవారికి పాస్‌పోర్ట్‌ అవసరమని, దాని కోసం హైదరాబాద్, చెన్నైలకు వెళ్లేందుకు ఎంతో వ్యయప్రయాసలు అవుతున్నాయని చెప్పారు. వాటిని గుర్తించి ఖమ్మంలో పాస్‌పోర్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2014, 2015 బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంట్‌ ముందుంచానని, పార్లమెంట్‌ వెలుపల విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ను పలుసార్లు కలిసి అభ్యర్థించానని, తన అభ్యర్థనను మన్నించి ఖమ్మంలో పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని మంజూరు చేశారని తెలిపారు.

ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాల్‌పెల్లి జిల్లాల ప్రజల సౌకర్యార్థం ఇక్కడ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. మన ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉందని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ప్రతినెల వందలాది మంది వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్తున్నారని, ఉన్నత చదువుల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని, ప్రజలు ఇక్కడ ఏర్పాటు చేసిన పాస్‌పోర్ట్‌ కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

 ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పాస్‌పోర్ట్‌ కార్యాలయం, ఎయిర్‌పోర్టు, ఐటీ హబ్‌ సెంటర్‌ తదితరాలు ప్రభుత్వ అభివృద్ధి చిహ్నాలని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ అధికారి విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో 250 పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్‌ కార్యాలయాలను విదేశాంగ శాఖ మంజూరు చేసిందని, ఇప్పటి వరకు 98 కార్యాలయాలను ఏర్పాటు చేశారని, ఖమ్మంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో తొలిరోజు 50 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ఇక్కడ నిత్యం 100కు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అందుకోసం కౌంటర్లను పెంచాల్సి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్, హైదరాబాద్‌ సర్కిల్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఈ.కల్నల్‌ ఎలీషా, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఖమ్మం జెడ్పీచైర్‌పర్సన్‌ గడినల్లి కవిత, ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ పాపాలాల్, గ్రంథాలయ చైర్మన్‌ ఖమర్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత పాస్‌పోర్ట్‌ కార్యాలయం ఎదుట ఎంపీ, ఎమ్మెల్యేలు మొక్కను నాటారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top