పైసలిస్తేనే సర్టిఫికెట్‌! 

Adilabad Revenue Department Officers Taking Bribe from People - Sakshi

సాక్షి, భైంసా (ఆదిలాబాద్‌) : ప్రభుత్వ కార్యాలయాల్లో దళారుల రాజ్యం నడుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాల్లో... సామాన్యులు రోజులు, నెలల తరబడి తిరిగినా కాని పనులు, వీరిని ఆశ్రయిస్తే మాత్రం గంటలు, రోజుల వ్యవధిలోనే పూర్తవుతున్నాయి. అధికారులకు, దళారులకు మధ్య సంబంధాలు ఉండడంతో వారు దగ్గరుండి మరీ పనులు చేయించుకుంటున్నారని విమర్శలున్నాయి. సామాన్య ప్రజలు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా రేపు, మాపు అని తిప్పుతుండడంతో విసిగి వేసారి దళారులను ఆశ్రయిస్తున్నారు. వారికి అడిగినంత సమర్పించుకుని పనులు చేయించుకుంటున్నారు. కొందరు దళారులు అధికారులకు తెలియకుండానే నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ పరం చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారుల వద్ద కంటే దళారుల వద్దే అధిక సంఖ్యలో దరఖాస్తులు ఉంటున్నాయనేది బహిరంగ రహస్యం

పనికో రేటు.. 
ఆదాయం, నివాసం, కుల, జనన, మరణ ధ్రువీకరణపత్రాలతోపాటు రైతులకు పట్టాదారుపాస్‌ బుక్‌లు, పహనీలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల మంజూరు.. ఇలా పని ఏదైనా తహసీల్దార్‌ కార్యాలయానికి రావల్సిందే. పట్టణ ప్రజలతోపాటు మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కొందరు దళారులు ఏళ్లుగా ఇదే పనిలో పాతుకుపోయి ఉండడంతో.. ఏ అధికారి వచ్చినా వారిని మచ్చిక చేసుకుని పనులు చేసుకుంటారని ఆరోపణలున్నాయి. దీంతో ప్రజలు కూడా దళారులను ఆశ్రయిస్తేనే పనులు త్వరగా పూర్తవుతాయని వారినే సంప్రదిస్తున్నారు. దీంతో దళారులు ప్రతి పనికి ఓ రేటు చొప్పున దరఖాస్తు దారుల నుంచి వసూలు చేసి అధికారులకు వాటాలు అందిస్తారని సమాచారం. 

దళారుల వద్దే ఎక్కువ దరఖాస్తులు.. 
దళారులను సంప్రదిస్తే త్వరగా పనులు పూర్తవుతుండడంతో చాలామంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. రెవెన్యూ అధికారుల వద్ద కంటే దళారుల వద్దే ఎక్కువ దరఖాస్తులు ఉండడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. పెద్దమొత్తంలో వేతనాలు అందుకునే అధికారుల కంటే దళారులే కోటీశ్వరులుగా మారుతున్నారని, అధికారుల సంపాదన కంటే దళారుల సంపాదనే ఎక్కువగా ఉంటోందని రెవెన్యూ సిబ్బందే చర్చించుకుంటున్నారు. 

పట్టాపాస్‌బుక్‌ల కోసం పాట్లు.. 
రైతులకు ఏడాదిలో ఎకరానికి రూ.8వేల పెట్టుబడి సాయం అందించేందుకుగాను రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. ఇందుకుగాను భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి కొత్త పట్టాదారు పుస్తకాలను అందించింది. అయితే ఈ ప్రక్రియలో ఇప్పటికీ చాలామంది రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు రాలేదు. పహనీలో పేరు రాయాలన్నా, రిజిస్ట్రేషన్‌ అయిన భూమికి మ్యుటేషన్‌ చేయాలన్నా, కొత్త పాస్‌బుక్‌ ఇవ్వాలన్నా వీఆర్వోల చేయి తడపాల్సిందే. తాము డబ్బులు పెట్టి కొన్న భూమికి రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా వీఆర్వోకు లంచం ముట్టనిదే పేరు మార్చడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొత్త పట్టాదారుపాస్‌బుక్‌లకోసం నెలల తరబడి తిప్పించుకుంటున్నారని వాపోతున్నారు. భూమి కొలవాలన్నా సర్వేయర్లు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  

మీసేవలోనే దరఖాస్తు చేసుకోవాలి 
ప్రజలు కుల, ఆదాయ, ఇతర సర్టిఫికెట్ల కోసం తహసీల్‌ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. గడువులోపు మీసేవ ద్వారానే ధ్రువపత్రాలు అందుతాయి. దరఖాస్తుదారులు దళారులను ఆశ్రయించవద్దు. వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. 
– రాజేందర్, తహసీల్దార్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top