ప్రవాసీలకు త్వరలోనే పట్టాలు!

Aadhaar For NRIs On Arrival Without Waiting - Sakshi

ఎన్నారైలకు శీఘ్రగతిన ఆధార్‌ కార్డులిచ్చేందుకు కేంద్రం ఓకే

ఆధార్‌తో ఈజీగా పాస్‌బుక్‌లు.. లక్షకు పైగా మందికి ఊరట

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు రాష్ట్రానికి చెందిన ఎన్నారైలకు ఊరట లభించింది. ఆధార్‌ కార్డులు లేకపోవడంతో భూమి పట్టాల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం దొరికింది. విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు ఆధార్‌ మంజూరీలో ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. భారత్‌కు వచ్చే ఎన్నారైలకు పాస్‌పోర్టుల సాయంతో తక్షణమే ఆధార్‌ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆధార్‌ కోసం 180 రోజులు వేచి చూడకుండా.. సాధ్యమైనంత త్వరగా వీటిని మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఎన్నారైలకు పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీకి మార్గం సుగమమైంది. ప్రవాసీలకు ఆధార్‌ కార్డు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కొత్త పాస్‌ పుస్తకాలను జారీ చేసిన రాష్ట్ర సర్కార్‌.. వీటికి ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరి చేసింది. అంతేగాకుండా నేరుగా భూ యజమానే రావాలని షరతు విధించింది. దీంతో స్వదేశానికి వచ్చినా.. ఆధార్‌ లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. దీనిపై కలెక్టరేట్ల చుట్టూ ఎన్నారైలు ఎన్ని చక్కర్లు కొట్టినా.. ప్రభుత్వం పరిష్కార మార్గం చూపకపోవడంతో నిరాశతోనే వెనుదిరిగారు.  

లక్షకు పైగా మందికి ఉపశమనం
ప్రవాసీలకు ఆధార్‌ కార్డు ఇవ్వాలనే నిర్ణయంతో లక్షకు పైగా మందికి ఉపశమనం కలగనుంది. ఎన్నారైలుగా ఉండి ఆధార్‌ కార్డు కలిగి ఉండటం నేరం కనుక.. అధిక శాతం మందికి ఈ కార్డుల్లేవు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయంతో విదేశాల్లో గణనీయంగా ఉన్న మన రాష్ట్ర వాసులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇంకా పెండింగ్‌లో ఉండగా.. ఇందులో 1.05 లక్షల వరకు ఎన్నారైలకు సం బంధించినవే ఉన్నాయని అధికారవర్గాలు చెబు తున్నాయి. ఆధార్‌ కార్డుల పొందిన వెంటనే వీరూ త్వరలోనే పట్టాలు పొందనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top