రిటైల్‌.. 24 గంటలు

telangana govt plans new retail policy - Sakshi

చిల్లర వర్తకానికి ప్రోత్సాహమిచ్చేలా కొత్త విధానం

‘రిటైల్‌ ట్రేడ్‌ మార్కెట్‌’ ముసాయిదా విధానాన్ని సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సింగిల్, మల్టీబ్రాండ్, మెగా రిటైల్‌ మార్కెట్లకు రాయితీలు.. కనీసం 10 కోట్ల పెట్టుబడి ఉంటే వర్తింపు

రూ. 100 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు భారీగా రాయితీలు

రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి రిటైల్‌
మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానానికి రూపకల్పన చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతోపాటు అపార వ్యాపార అవకాశాలు సృష్టించడం, ప్రపంచ స్థాయి గోదాములు, ప్రత్యేక రిటైల్‌ మార్కెట్‌ జోన్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ‘రిటైల్‌ ట్రేడ్‌ పాలసీ–2017’ను ప్రకటించనుంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో విస్తృతంగా రిటైల్‌ మార్కెట్ల ఏర్పాటు, ఈ రంగంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో రూపొందించిన కొత్త విధానం ముసాయిదాను ‘సాక్షి’ సంపాదించింది.  – సాక్షి, హైదరాబాద్‌

కనీసం రూ.10 కోట్లు
► కనీసం రూ.10 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే సింగిల్‌ బ్రాండ్, మల్టీ బ్రాండ్‌ రిటైలర్లు, షాపింగ్‌ మాల్స్, సూపర్‌ మార్కెట్లు, హైపర్‌ మార్కెట్లకు ఈ కొత్త పాలసీ కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉంటుంది. అయితే అవి వినియోగదారులకు నేరుగా అమ్మకాలు జరిపే రిటైల్‌ దుకాణాలు అయి ఉండాలి.
► పట్టణాలు, నగరాల మాస్టర్‌ ప్లాన్లలో రిటైల్, వినోదం కోసం ప్రత్యేక జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించనుంది. అంతర్జాతీయ మాల్స్‌కు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తారు.
► నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ)–2016 ప్రకారం రిటైల్‌ మార్కెట్ల భవనాల ఎత్తు పరిమితుల విషయంలో సడలింపులు ఇస్తారు.
► పార్కింగ్‌ స్థలాలపై పూర్తిగా ఆస్తి పన్ను మాఫీ, మురుగునీటి శుద్ధి కోసం ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వారికి ఆస్తి పన్నులో 15 శాతం రాయితీ కల్పిస్తారు.
► రిటైల్‌ మార్కెట్ల ఏర్పాటుకు భూవినియోగ మార్పిడి చార్జీలపై మినహాయింపు ఇస్తారు. ఈ మార్కెట్ల గోదాములకు పరిశ్రమల హోదా కల్పించి.. పరిశ్రమలకు సంబంధించిన అన్ని రకాల రాయితీ, ప్రోత్సాహకాలను అందిస్తారు.

రిటైల్‌ మార్కెట్లకు పెరుగుతున్న ఆదరణ
జాతీయ స్థూల ఉత్పత్తిలో రిటైల్‌ రంగం 600 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువతో 15 శాతం వాటా కలిగి ఉంది. ఇది ఏటా 16.7 శాతం వృద్ధితో 2020 నాటికి 1.3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందుతుందని కాగ్‌ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా మహా నగరాలతో పాటు చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం వినియోగదారుల జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి. మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ మార్కెట్లకు ఆదరణ పెరుగుతోంది. దేశ జనాభాలో 3.3 శాతం (4 కోట్ల మంది) రిటైల్‌ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం 95 శాతం రిటైల్‌ మార్కెట్‌ రంగం అసంఘటితంగా ఉండగా.. ప్రపంచీకరణ, ప్రపంచ స్థాయి రిటైల్‌ మార్కెట్‌ బ్రాండ్ల ఆగమనంతో భవిష్యత్తులో ఈ రంగం సంఘటితమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వస్తుసేవల రిటైల్‌ మార్కెట్‌ రంగంలో దేశంలో అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆహారం, కిరాణా, వస్త్రాలు, చెప్పులు, గృహోపకరణాలు, పరికరాలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, ఫర్నీచర్, ఆభరణాలు, పుస్తకాలు, సంగీతం, ఔషధాలు, ఆరోగ్య, సౌందర్య సాధనాల రిటైల్‌ విక్రయాలకు రాష్ట్రంలో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో రిటైల్‌ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

24 గంటలూ ఓపెన్‌
► షాపింగ్‌ మాల్స్‌ను పూర్తిగా 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం పనివేళలు, ఉద్యోగుల షిఫ్టులు, పార్ట్‌ టైం ఉద్యోగుల సేవలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలకు సం బంధించి ‘షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌’చట్టాన్ని ప్రభుత్వం సడలించనుంది. దీంతో ఏడాది పొడవునా మార్కెట్లు తెరిచి ఉంచవచ్చు. రాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య సైతం విక్రయాలు జరపవచ్చు.
► ఉద్యోగుల్లో 10 శాతం మంది మహిళలను నియమించుకుని.. వారికి రాత్రి 8.30 గంటలలోపు షిఫ్టుల్లో పనిచేసే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇక షాపులు, కార్మికులు, వేతనాలు, ఫ్యాక్టరీలు తదితర 13 చట్టాల కింద కార్మిక శాఖకు వార్షిక నివేదికను స్వీయ ధ్రువీకరణతో సమర్పించే అవకాశం కల్పిస్తారు.
► ప్రభుత్వం ఎస్మా చట్టం కిందకి ఆహారం, కిరాణా వస్తువులను చేర్చనున్నారు.
► అత్యవసర వస్తువుల చట్టం కింద ఆయా వస్తువుల నిల్వలపై పరిమితులను ఎత్తివేస్తారు.
► ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల విక్రయాల నియంత్రణపై కొత్త విధానాన్ని ప్రకటిస్తారు.
► రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనేలా వ్యవసాయ మార్కెట్‌ నియంత్రణ నిబంధనలను సడలిస్తారు.
► సైన్‌బోర్డుల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు పొందాలన్న నిబంధనలను సడలిస్తారు.
► మెగావాట్‌కుపైగా విద్యుత్‌ వినియోగం ఉండే రిటైల్‌ మార్కెట్లకు ఓపెన్‌ యాక్సెస్‌ విధానంలో నేరుగా విద్యుత్‌ కొనుక్కునే అవకాశం కల్పిస్తారు. ఇక రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టులతో స్వీయ అవసరాలకు విద్యుత్‌ వినియోగించుకోవచ్చు.

‘మెగా’మార్కెట్లకు భారీగా రాయితీలు
► రూ.100 కోట్ల కనీస పెట్టుబడితో మూడేళ్లలో 1,000 మందికి ఉపాధి కల్పించగల రిటైల్‌ వ్యాపారాలను ప్రభుత్వం ‘మెగా’మార్కెట్లుగా గుర్తించనుంది. వారికి ప్రత్యేకంగా పలు రాయితీలు అందించనుంది.
► మెగా రిటైల్‌ ప్రాజెక్టు కోసం కొను గోలు చేసే స్థలం, భవనాలపై 100 శాతం స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలను తిరిగి చెల్లిస్తారు.
► వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్‌ చార్జీల్లో రాయితీ.
► స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం చేసే ఖర్చులో 50 శాతం తిరిగి చెల్లింపు. గరిష్టంగా ఒక వ్యక్తి శిక్షణకు రూ.2 వేల వరకు ఇస్తారు.
► కొన్ని ప్రత్యేకించిన అభివృద్ధి పనులకు గరిష్టంగా రూ.5 లక్షల వరకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు.
► మెగా ప్రాజెక్టుల అవసరాల మేరకు ప్రభుత్వం మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top