9,181 గ్రామ రైతు సమితులు

9,181 గ్రామ రైతు సమితులు - Sakshi


గడువులోగా పూర్తిగా ఏర్పాటు చేయని వ్యవసాయ శాఖ

► మండల సమాఖ్యలు కూడా 60 శాతమే ఏర్పాటు!

► అధికారులపై వ్యవసాయ మంత్రి పోచారం ఆగ్రహం

► నేటి నుంచి మండల సమాఖ్యల సభ్యులకు శిక్షణ




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియ అసంపూర్తిగానే ముగిసింది. మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాలకుగాను చివరి రోజైన శనివారం నాటికి 9,181 గ్రామాల్లో మాత్రమే సమితులు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో అధికారులపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.


మరోవైపు కొన్నిచోట్ల గ్రామాలు పట్టణీకరణ చెందడంతో అవసరమైన రైతుల సంఖ్య లేక సమితులను ఏర్పాటు చేయలేదు. ఇక మండల రైతు సమాఖ్యలు గడువు లోగా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 60 శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. వాస్తవంగా గ్రామ, మండల, జిల్లా రైతు సమితులన్నీ ఈనెల 9 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాని గ్రామ, మండల సమితులు అనుకున్న ప్రకారం పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ఈనెల 14 నాటికి పూర్తి కావొచ్చని అధికారులు చెబుతున్నా.. అప్పటిలోగా పూర్తి కావడం అనుమానమే.



నేటి నుంచి మండల స్థాయి శిక్షణ

మండల రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యం లో జరిగే మండల స్థాయి శిక్షణ ఆదివారం నుం చి ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పా ట్లు చేసింది. ఈనెల 14 వరకు అన్ని మండలాల్లో శిక్షణ పూర్తి చేస్తారు. మండల రైతు శిక్షణలకు సీఎం హాజరవుతారని వ్యవసాయ వర్గా లు తెలిపాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలు కలిసొచ్చేలా 25 మండలాల రైతు శిక్షణలకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హా జరుకానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆయనకు 5 రోజులు ప్రత్యేకంగా హెలికాప్టర్‌ వసతి కల్పించింది. ఆయనతోపాటు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లే అవకాశ ముంది. కొన్నిచోట్లకు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్‌ డాక్టర్‌ జగన్‌మోహన్‌ కూడా వెళ్తారు. సమితులపై అవగాహనకు ç50 లక్షల కరపత్రాలను జిల్లాలకు పంపించారు.  



ఆందోళనలకు ప్రతిపక్షాలు సిద్ధం

రైతు సమితుల శిక్షణకు అడ్డుతగిలేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధం అయినట్లు సమాచారం. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల్లో తమకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదో చెప్పాలని నిలదీయాలని సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆటంకం కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.



753 ఏఈవో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

మండల రైతు సమన్వయ సమితులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు వ్యవసాయాధికారులను ఎంపిక చేసి వారికి శనివారం హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన శిక్షణలో 200 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ వారం రోజుల్లో 753 వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top