80 వసంతాల చిత్ర శోభితం!

80 Years Compleat Yakut MahalDelux Theatre - Sakshi

మకుటాయమానంగా ‘యాకుత్‌ మహల్‌ డీలక్స్‌’  

నగరంలో మొట్టమొదటి సినిమా టాకీస్‌  

అద్భుత రీతిలో అప్పటి నిర్మాణ శైలి  

చెక్కుచెదరని నాటి సాంకేతికతకు తార్కాణం    

నిజాం నవాబులు ఇందులోనే సినిమాలు చూసేవారు  

ఇప్పటికీ ఈ థియేటర్‌లో చలన చిత్రాల ప్రదర్శన   

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి సాధించిన ప్రస్తుత తరుణంలో సినిమా టాకీస్‌ నిర్మాణాల్లో పెను విప్లవాత్మక మార్పులు చోటుకుంటున్నాయి. థియేటర్లలో ఆధునిక హంగులు, విభిన్నమైన పరికరాలూ వచ్చాయి. కానీ నగరంలో ఎనిమిది దశాబ్దాల క్రితమే కొత్త టెక్నాలజీతో ఓ సినిమా టాకీస్‌ తన ప్రత్యేకతను చాటుకుంది. అదే పాతబస్తీలోని యాకుత్‌ మహల్‌ డీలక్స్‌. 19వ శతాబ్దిలోనే ఈ ఘనతను సాధించిందీ టాకీస్‌. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని నిజాం సంస్థానంలోనే పేరెన్నికగన్నది యాకుత్‌ మహల్‌ డీలక్స్‌.  తమకు వినోదాన్ని పంచేందుకు ఈ సినిమా హాల్‌ను నిజాం పాలకులు సుమారు 80 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు. నాడు ప్రారంభమైన ఈ టాకీస్‌ ఇప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంది. యాకుత్‌ మహల్‌ డీలక్స్‌.. దాని ప్రత్యేకతలు, కథాకమామిషుపై ప్రత్యేక కథనం.

సాక్షి, సిటీబ్యూరో :ప్రస్తుతం యాకుత్‌ మహల్‌ డీలక్స్‌ ఉన్న ప్రదేశంలో అప్పట్లో పచ్చదనంతో పరిఢవిల్లే వనాలు ఉండేవి. హైదరాబాద్‌ నగర ప్రహరీ గోడకు అవతల వైపు యాకుత్‌ దర్వాజా నుంచి వెళ్లే దారి ఉండేది. ఆ రోజుల్లో నిజాం పాలకులు టాకీస్‌ నిర్మాణం కోసం దాదాపు ఐదెకరాల స్థలాన్ని కేటాయించారు. యాకుత్‌ మహల్‌ టాకీస్‌ నిర్మాణాన్ని 1935లో నవాబ్‌ జాఫర్‌ నవాజ్‌ జంగ్‌ ప్రారంభించారు. 1938లో నిర్మాణం పూర్తయ్యింది. ఈ టాకీస్‌ ప్రొజెక్టర్‌ గది ప్రత్యేక ఆకర్షణగా  కనిపిస్తుంది. పైకప్పు, సీట్లు, తలుపులు ఒకేలా ఉంటాయి. పురాతన టైమర్లు ఇప్పటికీ సినిమాలో అమర్చి ఉన్నాయి. నవాబులు తమ కుటుంబ సమేతంగా సినిమా చూసేందుకు వచ్చే వారని, ఇందుకోసం బాల్కనీ మధ్యలో ప్రత్యేక పరదాలు ఉండేవని, హాల్‌ మధ్యలో కూడా మహిళలు, పురుషుల కోసం పరదాలు అమర్చేవారని చరిత్రకారులు చెబుతుంటారు.   

1927లో ప్రొజెక్టర్‌ ఆర్డర్‌..  
అప్పట్లో ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ప్రొజెక్టర్‌ అమెరికాలో అందుబాటులో ఉందని నిజాం పాలకులు ఆరాతీశారు. 1927లో చికాగోలోని మెక్‌ఆలేయ్‌ తయారు చేసిన పీర్‌లెస్‌ మాగ్నరాక్‌ మెషీన్‌ రెండు ప్రొజెక్టర్లకు ఆర్డర్‌ ఇచ్చారు. వీటిని 1938లో సముద్ర మార్గాన నౌకలో నగరానికి తీసుకువచ్చారు. ప్రొజెక్టర్‌లను ఏర్పాటు చేసి సినిమా రీళ్లను ప్రారంభించారు. హాల్‌లోని అన్ని మూలల్లో స్క్రీన్‌ ఆరు వాల్‌స్పీకర్లతో కూడిన డిజిటల్‌ ధ్వని వ్యవస్థను రూపొందించారు. ఏ మూల నుంచి చూసినా సినిమా నేరుగా కనిపించేలా సీటింగ్‌ ఏర్పాటు చేశారు.  
నగరంలో వినోద విప్లవానికి నాంది..

అప్పట్లో నగరంలో వినోదం కోసం ఓపెన్‌ ఎయిర్‌లో మూకీ సినిమాలు ప్రదర్శించేవారు. యాకుత్‌ మహల్‌ టాకీస్‌ అందుబాటులోకి వచ్చాక నగరంలో వినోద విప్లవం వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ టాకీ సినిమాలు అత్యాధునిక సౌండ్‌ సిస్టంతో ఉండడంతో నగరం నుంచే కాకుండా వివిధ ప్రదేశాల నుంచి సినిమా చూసేందుకు జనం ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. సుదూర ప్రాంతాల నుంచి పలువురు కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లపై, నవాబులు సంస్థాన ఉన్నత అధికారులు గుర్రాలపై వచ్చి సినిమా చూసి వెళ్లేవారు. మహల్‌ చుట్టూ చెట్లు ఉండడంతో ఇక్కడే వంటలు వండుకొని భోజనం చేసింతర్వాత తమ ప్రాంతాలకు వెళ్లేవారు.  

ఆధునిక సాంకేతికత అదరహో..
సుమారు ఎనభై ఏళ్ల క్రితం ఒకే రూఫ్‌ టెక్నాలజీతో రెండు అంతస్తుల సినిమా హాల్‌ నిర్మాణం..  547 ఇనుప కుర్చీలు, 192 సీటు బాల్కనీలు, 81 సీట్ల ను వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశా రు. నవాజ్‌ జంగ్‌ అనంతరం లక్ష్మీ నారాయణ్‌ యాద వ్‌ ఆ తర్వాత 2005 నుంచి షర్ఫన్‌ కుటుంబం ఈ సినిమా హాల్‌ నిర్వహణ కొనసాగిస్తున్నారు.  

ప్రేక్షకులుగా పలువురు ప్రముఖులు..
ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో పాటు అలనాటి హిందీ, తెలుగు సినీ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ యాకుత్‌ మహల్‌లో సినిమాలు చూసినవారిలో ఉన్నారు. నగరంలో ఇప్పటికే ఎన్నో సినీ థియేటర్లు మూసివేయగా.. హైదరాబాద్‌లోనే మొట్టమొదటి సినిమా టాకీస్‌.. ఎనభై ఏళ్ల క్రితం ప్రారంభమైన యాకుత్‌ మహల్‌ మాత్రం ఇప్పటికీ నడుస్తుండటం నగర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top