ప్రభుత్వ వైద్యుల్లోనూ ‘65 ఏళ్ల విరమణ’ డిమాండ్‌

65-year retirement demand among government doctors - Sakshi

బోధనా వైద్యులతోపాటే తమకూ పెంచాలని విన్నపం 

మరోవైపు ఖాళీలను భర్తీ చేయాలంటూ జూడాల ఒత్తిడి  

సాక్షి, హైదరాబాద్‌: బోధనాస్పత్రుల్లోని వైద్యులకు, అధ్యాపకులకు విరమణ వయస్సును 58 నుంచి 65 ఏళ్లకు చేయడంతో ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యుల్లోనూ విరమణ వయస్సు పెంపు డిమాండ్‌ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. విరమణ వయస్సు పెంపు, నిర్ణీతకాల పదోన్నతులు రెండూ తమకు వర్తింపచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జూనియర్‌ డాక్టర్లు మాత్రం విరమణ వయస్సు పెంపు వద్దని, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

వేధిస్తున్న వైద్యుల కొరత... 
బోధనాస్పత్రుల్లోని వైద్యులకు విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ గవర్నర్‌ ఇటీవల ఆర్డినెన్స్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. బోధనాస్పత్రుల్లో పలువురు ఉద్యోగ విరమణ వల్ల అనేక ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయకపోవడంతో వైద్య విద్య ఇబ్బందుల్లో పడుతుందని ఆ ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. సకాలంలో పదోన్నతులు జరపకపోవడం వల్ల కూడా ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల కేడర్‌లోని సీనియర్‌ బోధనా సిబ్బందిలో భారీగా తగ్గుదల కనిపిస్తుందని పేర్కొన్నారు. సూపర్‌ స్పెషాలిటీల్లోని కొన్ని యూనిట్లలో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఫలితంగా కొన్ని విభాగాలు దాదాపు మూసివేత అంచునకు చేరిన పరిస్థితి నెలకొందని అందులో ప్రస్తావించారు. ఇదే పరిస్థితి వైద్య విధాన పరిషత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ పరిధిలోని ఆస్పత్రుల్లోనూ నెలకొని ఉందని ప్రభుత్వ వైద్య సంఘాలు అంటున్నాయి. అయితే ప్రభుత్వ వైద్యుల డిమాండ్లను జూనియర్‌ డాక్టర్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. విరమణ వయస్సు పెంచితే తమకు ఉద్యోగాలు రావని అంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా వైద్యుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు.  

సర్దుబాటుపై సర్కారు ఆలోచన 
వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు సిబ్బందిని సర్దుబాటు చేయాలని సర్కారు ఆలోచన చేస్తుంది. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలా తక్కువ మంది సిబ్బంది ఉంటే, కొన్నిచోట్ల అధిక సిబ్బంది ఉంది. ఈ నేపథ్యంలో అధికంగా సిబ్బంది ఉన్నచోటు నుంచి బాగా కొరత ఉన్నచోటకు పంపించాలనేది ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top