తెలంగాణలో మరో 55 పాజిటివ్‌ కేసులు

55 New Corona Cases Reported In Telangana - Sakshi

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44..

8 మంది వలసదారులకు పాజిటివ్‌

సంగారెడ్డి జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో ఒకటి

రాష్ట్రంలో 1,509కు చేరిన కరోనా కేసుల సంఖ్య

హైదరాబాద్‌లో 168 కుటుంబాల్లో వైరస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శనివారం మరో 55 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 కేసులు నమోదయ్యాయి. మరో 8 కేసులు వలసదారులకు సంబంధించినవి. కాగా, తాజాగా సంగారెడ్డిలో 2, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,509కు చేరింది. అందులో 52 మంది వలసదారులే ఉన్నారు. శనివారం 12 మంది కోలుకోగా, వారితో కలిపి 971 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 34 మంది చనిపోగా, ప్రస్తుతం 504 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కింగ్‌కోఠిలోని వైద్య విధాన పరిషత్‌ హాస్పిటల్‌లో పని చేసే వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.

ఒకే అపార్ట్‌మెంట్‌లో 25 కేసులు 
చంచల్‌గూడ (హైదరాబాద్‌): సంతోష్‌నగర్‌ సర్కిల్‌ మాదన్నపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ తండ్రి, 11 నెలల పసిపాపకు కరోనా వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో అధికారులు అపార్ట్‌మెంట్‌లోని 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఇటీవల 11 నెలల పాపకు సంబంధించి శుభకార్యం నిర్వహించగా బంధువులు హాజరయ్యారు. కాగా బంధువుల్లో కరోనా లక్షణాలున్న వారు కార్యక్రమంలో పాల్గొనడంతో వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. ఇక అపార్ట్‌మెంట్‌లోని నివాసముండే వారికి వివిధ రకాలుగా కరోనా సోకిందని సమాచారం. కరోనా సోకిన వారికిలో ఓ గర్భిణీ కూడా ఉంది. శనివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో చర్చించి వెళ్లారు. అలాగే కుర్మగూడ బస్తీలో 70 ఏళ్ల వద్ధుడికి కూడా పాజిటివ్‌ అని తేలింది.

కుటుంబాలపై కాటు.. 
రాష్ట్రంలో అనేక కుటుంబాల్లో వైరస్‌ వ్యాప్తి చెందింది. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఏకంగా 168 కుటుంబాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే వారిలో ఎంతమందికి కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయన్న విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయలేదు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 59 కుటుంబాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. 

వివిధ జిల్లాల్లో కరోనా సోకిన కుటుంబాల సంఖ్య 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top