తెలంగాణలో మరో 49 కేసులు

49 New Corona Cases Recorded In Telangana - Sakshi

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల వెల్లడి

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 453

డిశ్చార్జి అయిన వారు 45మంది

ఇప్పటివరకు మృతి చెందిన బాధితులు 11మంది

25,000  ఇళ్లలో ఉండి క్వారంటైన్‌ పూర్తయిన వారు

నేడు వారికి విముక్తి: మంత్రి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బుధవారం కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 453కు చేరిందని తెలిపారు. అందులో ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జి కాగా, 11 మంది మృతి చెందారన్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఇంకా 397 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విదేశాల నుంచి వచ్చి క్వారం టైన్‌లో ఉన్నవాళ్లందరికీ గురువారం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. ‘కరోనా విజృంభించిన తర్వాత సుమారు 25 వేల మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీళ్లంతా వాళ్ల ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నెల 7 నాటికే వీళ్లందరి క్వారంటైన్‌ పీరియడ్‌ (14 రోజులు) పూర్తయింది. మరో రెండ్రోజులు అదనంగానే వీళ్లను క్వారంటైన్‌లో ఉంచిన ప్రభుత్వం, గురువారం అందరికీ విముక్తి కల్పించనుంది. విదేశాల నుంచి వచ్చినవాళ్లు, వాళ్ల కాంటాక్ట్‌ పర్సన్స్‌ను కూడా 
వదిలేయనున్నాం’అని పేర్కొన్నారు.

మర్కజ్‌ నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు..
రాష్ట్రం నుంచి 1,100 మంది వరకు మర్కజ్‌కు వెళ్లొచ్చారని, అందరికీ పరీక్షలు చేయించినట్లు మంత్రి ఈటల తెలిపారు. వీళ్లను కూడా ఇళ్లకు పంపిస్తామన్నారు. ప్రస్తుతం 167 సెంటర్లలో 3,158 మంది క్వారంటైన్‌లో ఉన్నారని వెల్లడించారు. వీళ్లంతా మర్కజ్‌ వెళ్లిన వాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు, కాంటాక్ట్‌ పర్సన్స్‌ అని పేర్కొన్నారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారు ఈ నెల 21 వరకు ఇళ్లల్లోనే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందన్నారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ రోజూ వీరిని పరిశీలిస్తుందని వివరించారు. వీరితో కాంటాక్ట్‌ అయినవారు ఈ నెల 28 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టంచేశారు. 

పెద్ద ఎత్తున టెస్టులు..
గడిచిన నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. నాలుగైదు రోజుల్లో కొత్త కేసుల నమోదు పూర్తిగా తగ్గిపోతుందని భావిస్తునట్లు పేర్కొన్నారు. మర్కజ్‌కు సంబంధించిన వారిలో 535 మంది శాంపిళ్లు సేకరించి పెట్టుకున్నామని, గురువారం సాయంత్రానికి వీటి ఫలితాలు కూడా వస్తాయన్నారు. ఇకపై ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌లను హోంక్వారంటైన్‌లోనే ఉంచుతామన్నారు. ఎన్‌–95 మాస్కులు, పీపీఈ కిట్లు సమకూర్చుకోవడంలో తొలుత కొంత ఇబ్బంది తలెత్తినా.. ఇప్పడు అన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 80 వేల పీపీఈ కిట్లు, లక్షకు పైగా ఎన్‌–95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇంకో 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల మాస్కులు, కోటికి పైగా హ్యాండ్‌ గ్లవ్స్‌లు ఆర్డర్‌ చేసినట్టు చెప్పారు.

ర్యాపిడ్‌ టెస్టులు చేయబోం..
రాష్ట్రంలో ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్టులు చేయబోమని మంత్రి తెలిపారు. వైరస్‌ కమ్యూనిటీ లెవల్‌లో వ్యాపించనందున, ఆ టెస్టులు అవసరం లేదన్నారు. ఇప్పటిలాగే అవసరమైన వాళ్లకు ప్రభుత్వమే ఉచితంగా టెస్టులు చేయిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం 3.5 లక్షల టెస్టింగ్‌ కిట్లు ఆర్డర్‌ చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను 15 రోజుల్లోనే 1500 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామన్నారు. ప్రస్తుతం ఛాతీ, కింగ్‌ కోఠి, గాంధీ ఆసుపత్రుల్లో కరోనా సోకిన వారు ఉన్నారని, ఇకపై గాంధీలో మాత్రమే కరోనా రోగులకు చికిత్స అందిస్తామని స్పష్టంచేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top