దక్షిణ మధ్య రైల్వేకు 4 పురస్కారాలు 

4 awards for South Central Railway - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయస్థాయిలో దక్షిణ మధ్య రైల్వే నాలుగు కీలక విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారాలు సాధించింది. 2018–19 సంవత్సరానికిగాను ట్రాఫిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్, పర్సనల్‌ మేనేజ్‌మెంట్, సివిల్‌ ఇంజనీరింగ్, స్టోర్స్‌ విభాగాల్లో ఈ పురస్కారాలను దక్కించుకుంది. జూలై 7న ముంబైలో జరిగే 64వ రైల్వే వారోత్సవాల్లో రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఉద్యోగుల సమున్నత కృషి వల్లే నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలకు దక్షిణ మధ్య రైల్వే ఎంపికైందని జీఎం గజానన్‌ మాల్యా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఉద్యోగులకు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.  

ట్రాఫిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ పురస్కారం: రైల్వే బోర్డు నిర్ధారించిన లక్ష్యం కంటే 10 శాతం అధికంగా సరుకు రవాణా చేసింది. 122.51 మిలియన్‌ టన్నుల సరుకును రవాణా చేసింది. 2,152 ప్రత్యేక రైలు ట్రిప్పులు, 10 వేల అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసి మరీ సరుకును తరలించి టాప్‌లో నిలిచింది. 

పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ షీల్డ్‌: ఉద్యోగుల సంక్షేమ, ఉల్లాస కార్యక్రమాలు నిర్వహించటంలో ముందంజలో నిలిచింది. ఉద్యోగులకు విదేశీ పర్యటన అవకాశం, క్యాంటీన్‌ ఏర్పాటు, మెరుగ్గా నిర్వహణ, పలు డిజిటల్‌ ఆవిష్కరణలతో మానవ వనరుల వికాసం, విజ్ఞాన కార్యక్రమాల అమలు, ఉద్యోగులకు యూనిక్‌ మెడికల్‌ ఐడెంటిటీ కార్డు సరఫరా తదితర చర్యలతో ఈ పురస్కారానికి ఎంపికైంది. 

స్టోర్స్‌: తుక్కును విక్రయించటం ద్వారా ఏకంగా రూ.340 కోట్లు సాధించి బోర్డు లక్ష్యం కంటే 17 శాతం ఎక్కువ పనితీరు కనబరిచింది. ప్రయాణికుల భద్రత, వారికి కావాల్సిన వస్తువుల లభ్యత 100 శాతంగా ఉండటం, అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లపై ప్రకటనల ముద్రణ ద్వారా రూ.3 కోట్ల ఆదాయ సముపార్జన. 

సివిల్‌ ఇంజనీరింగ్‌: నిర్ధారిత లక్ష్యం కంటే ముందుగానే కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించి దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. బాలాస్ట్‌ క్లీనింగ్‌ మెషీన్‌లు వినియోగించి 628 కి.మీ. నిడివి గల రైలు పట్టాల పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఈ విభాగంలో పశ్చిమ, ఉత్తర రైల్వేలతో కలసి సంయుక్తంగా ఈ పురస్కారం సాధించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top