పెరిగిన కృష్ణమ్మ ఉధృతి

1.94 lakh cusecs flow into Srisailam reservoir - Sakshi

శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 1.94 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

నేడు వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణమ్మ వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. శనివారం నాగార్జున సాగర్‌లోకి 2,67,712 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఈ ఏడాది సాగర్‌లోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 540 అడుగుల్లో 188.32 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

మరో 15 రోజులపాటూ వరద కొనసాగే అవకాశం ఉండటం.. రానున్న రోజుల్లో ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేస్తోన్న అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది నాగార్జునసాగర్‌ నిండే అవకాశాలు మెండుగా ఉన్నాయని జలవనరుల శాఖ అధికారవర్గాలు భావిస్తున్నాయి.

నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ఉప నదులైన భీమా, తుంగభద్ర, హంద్రీ వరద ప్రవాహంతో ఉరకలెత్తుతున్నాయి. శనివారం శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 1,94,431 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో 884.3 అడుగుల్లో 211.476 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 11 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,054 క్యూసెక్కులు, హంద్రీ నీవా ద్వారా 1,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఆదివారం వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. కేంద్ర జలసంఘం సూచనల మేరకు శ్రీశైలం రిజర్వాయర్‌ ఏడు గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల ద్వారా నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో నాగార్జునసాగర్‌లోకి 2,67,712 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నాగార్జునసాగర్‌ నిండాలంటే ఇంకా 124 టీఎంసీలు అవసరం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top