ఏజెన్సీలో ‘పోడు’ పోరు

19 Adivasis are arrested - Sakshi

తోపులాటలో ఇద్దరు అధికారులకు గాయాలు  

ఇల్లెందు మండలం వీరాపురం, కోటగడ్డలో ఉద్రిక్తత 

19 మంది ఆదివాసీల అరెస్టు

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట పంచాయతీ పరిధిలోని వీరాపురం, కోటగడ్డ గ్రామాల్లో పోడు పోరు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో 19 మంది ఆదివాసీలను పోలీసులు అరెస్టు చేశారు. కోటగడ్డ గ్రామం పరిధిలోని 20 హెక్టార్ల భూమి విషయంలో గత ఏడాది కాలంగా అటవీ శాఖకు, ఆదివాసీలకు పోరు జరుగుతోంది. ఈ భూమిలో మొక్కలు నాటేందుకు అధికారులు శనివారం ఉదయం ట్రాక్టర్లతో దుక్కి దున్నుతుండగా 19 మంది ఆదివాసీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అటవీశాఖ సెక్షన్‌ అధికారి సుక్కి, బీట్‌ అధికారి సత్యవతికి గాయాలయ్యాయి. కొందరు గిరిజనులు కూడా గాయపడ్డారు. అనంతరం ఆదివాసీలను అరెస్టు చేసి ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌కు తరలించిన తర్వాత అటవీ అధికారులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నారు.

ఈ సందర్భంగా ఎఫ్డీఓ అనిల్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కోటగడ్డ అటవీ ప్రాంతంలో మొత్తం 34 హెక్టార్లు ఉండేదని, ఇందులో 14 హెక్టార్లు గిరిజనులకు, 20 హెక్టార్లు అటవీ శాఖ పరిధిలో ఉండేలా గతంలోనే ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ భూమికి సంబంధించి ఎవరికీ పట్టాలు లేవని, ఒకవేళ ఎవరి వద్దనైనా ఉంటే అవి చూపిస్తే.. మొక్కలు నాటిన తర్వాత కూడా వారికే అప్పగిస్తామని చెప్పారు. హక్కు పత్రాలు లేకుండా పోడు నరికి భూమి తమదే అంటే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. అరెస్టు చేసిన వారిలో ఒక్కరికి కూడా హక్కు పత్రాలు లేవని స్పష్టం చేశారు. కాగా, ముత్తారపుకట్ట సర్పంచ్‌ మంకిడి కృష్ణ మాట్లాడుతూ.. ఈ భూమిలో మల్లెల కృష కు 9 ఎకరాలు, కళకు 5 ఎకరాలు, సుగుణకు 4 ఎకరాల పట్టా ఉందని, రైతుబంధు పథకం కింద సాయం కూడా పొందారని వివరించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top