జయిస్తూ..ఇంటికెళ్తూ..

177 Corona Patients Discharge From Gandhi Hospital - Sakshi

ఇప్పటివరకు 970 కరోనా కేసులు నమోదు 

జీహెచ్‌ఎంసీ పరిధిలో 177 మంది డిశ్చార్జి

బాధితులకు మూడు పూటలా పౌష్టికాహారం

నిపుణుల ద్వారా కౌన్సెలింగ్‌తో మానసిక స్థైర్యం   

వేళకు హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ టాబ్లెట్లు  

స్వస్థత చేకూరడంతో స్వస్థలాలకు తిరుగు పయనం    

దేశంలో రికవరీ 19.9 శాతం.. గాంధీలో 22 శాతం

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చేరిన బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు ఒక్కొక్కరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 970 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో గురువారం వరకు 525 కేసులు నమోదు కాగా ఇప్పటికే 177 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం వంటి కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన వారిని వైద్యులు మూడు కేటగిరీలుగా విభజించారు. వీరిలో అనుమానితులను కేటగిరీ–1గా, విదేశీ ట్రావెల్‌ హిస్టరీ ఉన్నవారిని కేటగిరీ–2గా, మర్కజ్‌ లింక్‌ ఉన్న కేసులను కేటగిరీ– 3గా విభజించారు. వ్యాధి లక్షణాలను బట్టి వారిని వేర్వేరు ఐసోలేషన్‌ వార్డుల్లో అడ్మిట్‌ చేశారు. వీరి నుంచి స్వాబ్‌ కలెక్ట్‌ చేసి పరీక్షలు చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసీయూకి తరలించారు. నెగిటివ్‌ వచ్చిన వారిని 14 రోజుల ఐసోలేషన్‌లోనే ఉంచారు.  ప్రొటోకాల్‌ ప్రకారంవారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ వంటి మందులు అందజేశారు. మూడు పూటలా పౌష్టికాహారం (ఉదయం ఇడ్లీ, మైసూర్‌ బజ్జీ, బ్రెడ్డు, ఉప్మా, టీ లేదా పాలు ఇచ్చారు. ఇక మధ్యాహ్నం రైస్‌తో పాటు ఒక కూర, పప్పు, పెరుగు, గుడ్డు, అరటి పండ్లను అందించారు. సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా డ్రైçఫ్రూట్స్, టీ, రాత్రి డిన్నర్‌లో చపాతీ, రైస్, రెండు కూరలు, పెరుగు) అందజేశారు. ఉంటున్న వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, హైజీన్‌ పాటించడం వల్లే వారు త్వరగా కోలుకోవడానికి వీలైంది. 

డిప్రెషన్‌లోకి వెళ్లకుండా..  
ఒకే కుటంబంలో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకడం, ఒకే గదిలో రెండు మూడు వారాల పాటు ఉండాల్సి రావడంతో వీరిలో కొంత మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వారు డిప్రెషన్‌లోకి వెళ్లకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించి వారిలో మనోస్థైర్యాన్ని నింపి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దినట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

మార్చి 18న తొలి డిశ్చార్జి..  
నగరంలో మార్చి 2న తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆఫీసు పనిపై దుబాయ్‌కి Ðవెళ్లాడు. ఇటలీకి చెందిన వ్యక్తులతో కలిసి పని చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బెంగళూర్‌కు.. అటు నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఫిబ్రవరి 29న గాంధీలో అడ్మిట్‌ కాగా మార్చి 2న ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మార్చి 18న ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అప్పటి వరకు కేవలం ఆరు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదు కాగా, ఆ తర్వాత ఏప్రిల్‌ మొదటి వారంలో ఎన్నారై బాధితులు సహా ఇండోనేషియా బాధితును డిశ్చార్జి చేశారు. క్రమంగా ఒకరి తర్వాత మరొకరు.. ప్రతి రెండు మూడు రోజులకు పది మంది చొప్పున డిశ్చార్జి చేశారు. తాజాగా గురువారం 58 మందిని డిశ్చార్జి చేశారు.

దేశ సగటు రికవరీ రేట్‌తో పోలిస్తే..  
ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 177 మందిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది ఆస్పత్రి నుంచి ఇళ్లకు పంపించారు. వీరి ఆరోగ్యం సాధారణ వైద్య చికిత్సలకే మెరుగుపడినట్లు తెలిసింది. దేశంలో కరోనా రికవరీ రేట్‌ 19.9 శాతం ఉంటే.. మన గాంధీలో మాత్రం 22 శాతం ఉండటం గమనార్హం.   

మంచి ఆహారం పెట్టారు
గాంధీ కరోనా సెంటర్‌లో రోగులకు మంచి పౌష్టికాహారం ఇచ్చారు. ఉదయం టిఫిన్‌లో భాగంగా ఒక్కో రోజు ఒక వెరైటీ ఆహారం అందజేశారు. మధ్యాహ్నం లంచ్‌లో రైస్‌తో పాటు గుడ్డు, రెండు కూరలు, పెరుగు, అరటి పండు ఇచ్చారు. ఇక సాయంత్రం డ్రైప్రూట్స్, టీ ఇచ్చారు. రాత్రి డిన్నర్‌లో చపాతీ, రైస్‌ కూరలు, పెరుగు అందించారు. ఆస్పత్రిలో ఎలాంటి ఇబ్బందీ లేదు. వైద్యులు బాగా చూసుకున్నారు.  
–బాధితుడు (45), మర్పల్లి, వికారాబాద్‌ జిల్లా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top