రాకాసి వైరస్‌

13 Positive COVID 19 Cases Filed in Telangana - Sakshi

13 పాజిటివ్‌ కేసులు నమోదు

క్లోజ్‌ కాంటాక్ట్‌లో 331 మందికిపైగా..

సెల్ప్‌ రిపోర్ట్‌లో మరికొందరు

గాంధీలో ఇప్పటివరకు 464 మందికి పరీక్షలు.. అందరికీ నెగిటివ్‌

విదేశాల నుంచి వస్తున్న వారిలోనే పాజిటివ్‌

షట్‌డౌన్‌ చేసే ఆలోచనలో అధికార యంత్రాంతం?

గాంధీ ఐసోలేషన్‌లో ప్రస్తుతం 12 పాజిటివ్‌ కేసులు  

22 మంది అనుమానితులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌.. ఆరోగ్య రాజధాని.. అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉన్న నగరం. కరోనా వైరస్‌కు చిగురుటాకులా వణుకుతోంది. సిటీలో వైరస్‌ పుట్టిన జాడలు లేకపోయినప్పటికీ.. విదేశీ ప్రయాణికులు మోసుకొస్తున్న ఈ మహమ్మారి నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. చైనాలోని వూహాన్‌ నగరంలో పుట్టిన ఈ వైరస్‌ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వందకుపైగా దేశాలకు పాకింది.  దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 151 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క తెలంగాణలోనే మొత్తం 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరికి 331 మందికిపైగా క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. అదృష్టవశాత్తూ వారందరికీ నెగిటివ్‌ రిజల్ట్‌ రావడం శుభపరిణామమే అయినప్పటికీ.. గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులకు వస్తున్న అనుమానితుల సంఖ్యను చూస్తే మాత్రం ఆందోళనవ్యక్తమవుతోంది.      

తొలి పాజిటివ్‌ నుంచి..
దుబాయ్‌ నుంచి బెంగళూర్‌కు అటు నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న మహేంద్రహిల్స్‌కు చెందిన ఓ యువకుడి (24)కి మార్చి 2న కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇదే తొలి కేసు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఆయనతో కలిసి బస్సులో ప్రయాణించినవారు.. ఇంట్లో కలిసి ఉన్న కుటుంబ సభ్యులు.. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన తర్వాత అతడిని పరీక్షించిన వైద్యులు.. నర్సులు.. ఇలా మొత్తం ఆయనతో 88 మంది క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో అతనికి ఆస్పత్రిలోని వైద్యుడితో పాటు హౌస్‌కీపింగ్‌ వర్కర్‌ వరకు త్యంత క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించి, వీరికి గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పుణెలో నిర్వహించిన రెండో పరీక్షలో నెగిటివ్‌ వచ్చింది. దీంతో వారికి వైరస్‌ సోకలేదని నిర్ధారించారు. నాలుగు రోజుల పాటు గాంధీ ఐసోలేషన్‌ వార్డులో ఉంచి, ఆ తర్వాత హోం ఐసోలేషన్‌కు తరలించారు. వైద్య చికిత్సలకు తొలి పాజిటివ్‌ బాధితుడు పూర్తిగా కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత అతడిని కూడా మరో రహస్య ప్రదేశానికి తరలించి హోం ఐసోలేషన్‌లో ఉంచింది.
ఇటలీ నుంచి వచ్చిన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతి (24)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది రెండో కేసు. ఆమెకు క్లోజ్‌కాంటాక్ట్‌ లో 69 మంది ఉన్నట్లు గుర్తించి, ఆ మేరకు వారందరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా లేదని తేలింది.  
నెదర్లాండ్‌ నుంచి వచ్చిన కొత్తపేటకు చెందిన వ్యక్తి (48)కి మూడో పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయింది. ఆయనకు క్లోజ్‌కాంటాక్ట్‌లో 42 మంది ఉన్నట్లు గుర్తించి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది.  
స్కాట్‌లాండ్‌ నుంచి ఇటీవలే నగరానికి చేరుకున్న బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఆయనకు క్లోజ్‌కాంటాక్ట్‌లో 11 మంది ఉన్నట్లు గుర్తించి వారిని కూడా పరీక్షించారు. వీరికి కూడా నెగిటివ్‌వచ్చింది.   
ఇండోనేషియాకు చెందిన కరీంనగర్‌ జిల్లావాసికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆయనకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో 11 మంది ఉన్నట్లు గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు.  
తాజాగా బుధవారం స్కాట్‌లాండ్‌ నుంచి వచ్చిన నాచారానికి చెందిన మరో యువకునికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయనకు ఐదుగురు కుటుంబ సభ్యులు సహా డ్రైవర్‌ క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించి, ప్రస్తుతం వారిని గాంధీ ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.  
సౌదీ అరేబియా నుంచి వచ్చిన కర్ణాటకకు చెందిన వృద్ధుడు (76) జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో బంధువులు మార్చి 4న గుల్బర్గా మెడికల్‌ కాలేజీలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను మార్పి 9న గుల్బర్గా నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. బంజారాహిల్స్, సోమాజిగూడ, సికింద్రాబాద్లోని మూడు ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చూపించారు. తిరుగు ప్రయాణంలో మార్చి 10న అతడు మృతి చెందారు. ఆయన తెలంగాణ వాసి కాకపోయినప్పటికీ.. చికిత్స సమయంలో ఆయనకు ఆయా ఆస్పత్రుల్లో క్లోజ్‌కాంటాక్ట్‌లో 36 మంది వరకు ఉన్నట్లు గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఆయనతో పాటు గుల్బర్గా వెళ్లి వచ్చిన టోలిచౌకీకి చెందిన ముగ్గురు వ్యక్తులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ కాలేదు. వీరందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

అష్ట దిగ్బంధనం దిశగా అడుగులు?
ఇప్పటి వరకు వెలుగు చూసిన కరోనా పాజిటివ్‌ కేసులన్నీ సెకండ్‌ కాంటాక్ట్‌కు సంబంధించినవే. విదేశాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వారిలోనే లక్షణాలు బయటపడ్డాయి. నగరంలో ఉండి, పాజిటివ్‌ బాధితులకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న ఏ ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఇక్కడి వారిలో ఏ ఒక్కరికి వైరస్‌ సోకినా ఇక దాన్ని నియంత్రించడం కష్టమేనని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దేశంలో వైరస్‌ విస్తరణ రెండో దశలో ఉంది. నియంత్రణ గడువు కూడా సమీపిస్తోంది. వారం పది రోజుల్లో దీన్ని పూర్తిగా నియంత్రించలేకపోతే.. వైరస్‌ విస్తరణ మూడో దశకు చేరుకుంటుంది. ఈ దశలో దీనిని కట్టడి చేయడం చాలా కష్టం. నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే విశేషంగా ప్రచారం చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్, మాల్స్, పబ్‌లు, క్లబ్‌లు, బార్ల తదితర సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయినప్పటికీ.. రోజుకో పాజిటివ్‌ కేసుతో పాటు అనుమానితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. థర్డ్‌కాంటాక్ట్‌ కేసులు వెలుగు చూడకముందే హైదరాబాద్‌ నగరాన్ని అష్టదిగ్బంధనం చేయడం ఒక్కటే దీనికి పరిష్కారమని సూచిస్తున్నారు. 

ఇదీ లెక్క..  
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 151 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వీరిలో 126 మంది స్వదేశీయులు. 25 మంది విదేశీయులు. చికిత్స తర్వాత 14 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు నగరంతో సంబంధం ఉన్నవారు. మరో ఇద్దరు విదేశీయులు. చికిత్స తర్వాత వీరిలో ఒకరు కోలుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇప్పటి వరకు 70,545 మందికిపైగా ప్రయాణికులకు స్క్రీనింగ్‌ నిర్వహించారు. 1,262 మందిని అనుమానించారు. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 447 మందికి గాంధీలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఐదుగురు కరోనా పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. 22 మంది అనుమానితులు ఐసోలేషన్‌ వార్డులో రిజల్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వికారాబాద్, దూలపల్లి క్వారంటైన్‌లో 221 మంది వరకు ఉండగా.. మరో 1,238 మందిని హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top