కరోనాపై యుద్ధం.. 1.3 కోట్ల సైన్యం

1.3 Crore People Are Fighting Against Coronavirus In India - Sakshi

దేశవ్యాప్తంగా కరోనా యోధుల లెక్క తేల్చిన కేంద్రం

పోరులో డాక్టర్ల నుంచి గ్రామీణ డాక్‌ సేవక్‌ల వరకు

ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, మాజీ సైనికులు, ఆశ వర్కర్లు..

అత్యధిక సంఖ్యలో అంగన్‌వాడీల భాగస్వామ్యం..

కరోనాపై పోరులో తెలంగాణలో 3.36 లక్షల మంది..

ఏపీలో 7.24 లక్షల మంది యోధులు.. 

సాక్షి, హైదరాబాద్‌: రోజుకు ప్రపంచంలో ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయి.. మన దేశంలో ఈ రోజు ఎంతమందికి సోకింది.. మన రాష్ట్రంలో సంఖ్య పెరిగిందా? మన జిల్లాలో ఏమైనా కొత్త కేసులు వచ్చాయా? మన ఊ ర్లో ఎంతమందికి వచ్చింది? ఎంతమంది క్వారంటైన్‌లో ఉన్నారు? ఎంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు? ఎంత మంది రికవరీ అయి ఇళ్లకు వెళ్లారు? ప్రస్తుత కరోనా కాలంలో రోజూ చూస్తున్న, తెలుసుకుంటున్న లెక్కలివీ. కానీ అసలు ఈ కరోనా మహమ్మరిపై ఎంత మంది యుద్ధం చేస్తున్నారు? రోజూ మహమ్మారితో ప్రత్యక్షంగా పోరాడుతూ మన దేశంలో, రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రిస్తున్నారనే దాని గురించి ఆలోచించారా? కరోనా యోధులుగా పిలిచే వీరి సంఖ్య 1.3 కోట్లకు పైగానే. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనాపై వీరంతా పోరాడుతున్నారు. ఇందులో ఎంబీబీఎస్‌ డాక్టర్ల నుంచి గ్రామీణ డాక్‌ సేవక్‌ల వరకు ఉన్నారని కేంద్ర లెక్కలు చెబుతున్నాయి.

ఎవరి పనిలో వారు.. 
కరోనా పై యుద్ధమంటే ఆషామాషీ కాదు. కంటికి కనిపించని ఆ మహమ్మరిని ఎదుర్కోవాలంటే వ్యూహమే కాదు జాగ్రత్త కూడా ఉండాలి. అలాంటి యుద్ధంలో లక్షలాది మంది పోరాడుతున్నారు. వీరిలో ఎంబీబీఎస్‌ డాక్టర్లు, విద్యార్థులు, నర్సులు, ఫార్మసిస్టులు, మాజీ సైనికులు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీలు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది, హోం గార్డులు, ఫైర్‌ సిబ్బంది పని చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా యోధుల సంఖ్య 1,39,68,832 మంది అని కేంద్రం తేల్చింది.

వీరిలో అంగన్‌వాడీల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. దాదాపు 25 లక్షల మందికి పైగా అంగన్‌వాడీ సిబ్బంది దేశంలో కరోనా నియంత్రణ యుద్ధంలో పాలు పంచుకుంటున్నారు. ఆశ వర్కర్లు, గ్రామీణ డాక్‌ సేవక్‌లు, హోం గార్డులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, నర్సులు, ఫార్మసిస్టులు కూడా ఒక్కో రంగం నుంచి 10 లక్షల మంది కంటే ఎక్కువ మందే పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 3,36,773 మంది కరోనాపై యుద్ధం చేస్తుండగా, ఏపీలో 7,24,394 మంది పోరాడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అంగన్‌వాడీల భాగస్వామ్యమే ఎక్కువ ఉందని లెక్కలు చెబుతున్నాయి.

(వీరితో పాటు ఈఎస్‌ఐ ఆసుపత్రులు, రైల్వే, ఆర్డినెన్స్, పోర్టు ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల సిబ్బంది, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణులు కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నారు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top