కొత్త గురుకులాలు రెడీ!

119 BC Gurukul schools are ready to start - Sakshi

119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభానికి సిద్ధం  

ఈ నెల 17 నుంచి అందుబాటులోకి.. 

తొలి ఏడాది 5, 6, 7 తరగతులతో మొదలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కోసం కొత్తగా మంజూరు చేసిన 119 గురుకుల పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 19 పాఠశాలలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. 2017–18 విద్యా సంవత్సరంలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించగా.. 2019–20 విద్యా సంవత్సరంలో మరో 119 గురుకుల పాఠశాలలను స్థాపించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఈ క్రమంలో చర్యలు చేపట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కసరత్తు పూర్తి చేసింది. 119 గురుకుల పాఠశాలలకు అద్దె భవనాలను సిద్ధం చేసి అందులో మౌలిక వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. పుస్తకాలు, విద్యార్థుల మెటీరియల్‌ను ఇప్పటికే పాఠశాలల్లో అందుబాటులో పెట్టింది. దాదాపు అన్ని పాఠశాలల్లో సిబ్బంది సర్దుబాటు సైతం పూర్తయింది. వాస్తవానికి ఈ నెల 12 నుంచి బడులు ప్రారంభమవుతాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొత్త గురుకులాలు మాత్రం 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

28,560 మందికి లబ్ధి.. 
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున 119 గురుకుల పాఠశాలలు వారంరోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కొత్త గురుకులాల్లో 5, 6, 7 తరగతులను ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతి అప్‌గ్రేడ్‌ అవుతుంది. కేజీ టూ పీజీ విద్యా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న గురుకుల పాఠశాలలను ఇకపై జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. పదో తరగతి వరకు అప్‌గ్రేడ్‌ అయిన వాటిల్లో ఇంటర్మీడియట్‌ను సైతం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది కొత్తగా 119 గురుకులాల ప్రారంభంతో అదనంగా 28,560 మంది విద్యార్థులకు లబ్ధి కలగనుంది.

కొత్త వాటితో కలిపితే రాష్ట్రంలో మొత్తం 257 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో 94,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరో రెండేళ్లలో ఈ విద్యార్థుల సంఖ్య లక్ష దాటనుంది. గురుకులాల్లో జూనియర్‌ కాలేజీలు సైతం ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది. కొత్త గురుకులాల ప్రారంభంతో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ అతి పెద్ద గురుకుల సొసైటీగా అవతరించనుంది. ఇప్పటివరకు 238 గురుకుల పాఠశాలలతో పెద్ద సొసైటీగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)ని రికార్డును బీసీ గురుకుల సొసైటీ అధిగమించనుంది. వచ్చే ఐదేళ్లలో అత్యధిక విద్యార్థులున్న సంస్థగా బీసీ గురుకుల సొసైటీ అవతరించనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top