ఎయిర్‌టెల్‌ ఫ్రీగా ఆ సర్వీసులు

ఎయిర్‌టెల్‌ ఫ్రీగా ఆ సర్వీసులు

సాక్షి, ముంబై : టెలికాం మార్కెట్‌లో తమకు చుక్కులు చూపిస్తున్న రిలయన్స్‌ జియోకు షాకిచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరో కొత్త సర్వీసులతో రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు జియో మాత్రమే అందిస్తున్న వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ(వోల్ట్‌) కాలింగ్‌ సర్వీసులను, ఎయిర్‌టెల్‌ కూడా లాంచ్‌ చేసింది. ఈ సర్వీసులతో ఇంటర్నెట్‌ డేటాను వాడుకుంటూ యూజర్లు తమ వాయిస్‌ కాల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఈ సర్వీసులను అందిస్తున్నందుకు ఎలాంటి అదనపు ఛార్జీలను ఎయిర్‌టెల్‌ వసూలు చేయదు. కస్టమర్లకు ఇవి పూర్తిగా ఉచితం. నేటి(సోమవారం) నుంచి ముంబైలో ఈ సర్వీసులను ఎయిర్‌టెల్‌ లైవ్‌గా అందించడం ప్రారంభించింది. జియో తర్వాత ఈ సేవలను లాంచ్‌ చేసిన రెండో టెలికాం ఆపరేటర్‌ ఎయిర్‌టెలే. 

 

దేశవ్యాప్తంగా 260 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లున్న ఈ టెల్కో, ముంబైలో తన నెట్‌వర్క్‌ పరిధిలోని కస్టమర్లకు లైవ్‌గా ఈ ఫీచర్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. మిగతా సబ్‌స్క్రైబర్లకు ఈ సపోర్టును విస్తరిస్తామని చెప్పింది. అయితే 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే అందించే జియో మాదిరిగా కాకుండా.. ఎయిర్‌టెల్‌ 3జీ, 2జీ నెట్‌వర్క్‌కు కూడా ఈ సర్వీసులను అందించనుంది. మరికొన్ని నెలల్లో అన్ని ప్రాంతాల కస్టమర్లకు హెచ్‌డీ క్వాలిటీతో కాలింగ్‌ను అందించడానికి వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ సేవల విస్తరణను వేగవంతం చేస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్స్‌ డైరెక్టర్‌ అభయ్ సావర్గొంకర్ చెప్పారు.  

 

గతేడాది జియో మార్కెట్‌లోకి ప్రవేశించాక, వోల్ట్‌ సర్వీసులు చాలా పాపులర్‌ అయ్యాయి. 4జీ సేవలు మరింత వేగంగా విస్తరించడానికి ఈ సర్వీసులు ఎంత గానో సహకరిస్తాయి. వోల్ట్‌ సర్వీసులతోనే జియో అపరిమిత ఉచిత కాల్స్‌ను తన యూజర్లకు అందిస్తోంది.  వోల్ట్‌ సేవలు వినియోగించుకోవాలంటే ఫోన్‌ యూజర్లకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సపోర్టు కావాల్సి ఉంటుంది. జియో వోల్ట్‌ కాల్స్‌ సేవలను ప్రారంభించిన అనంతరం చాలా స్మార్ట్‌ఫోన్లు వోల్ట్‌ సేవలకు అనుగుణంగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. 
Back to Top