కుట్రలను అడ్డుకోండి


 డ్యాం నిర్మాణానికి కర్ణాటకకు అనుమతి ఇవ్వొద్దు

  విజయకాంత్ నేతృత్వంలో ఢిల్లీ పయనం

  ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ

 


 సాక్షి, చెన్నై:కావేరి జలాలు తమిళనాడుకు అందకుండా కర్ణాటక చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు  కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. మేఘదాతులో డ్యాంల నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలకు అనుమతి ఇవ్వొద్దని వేడుకున్నాయి. డీఎండీకే నేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌తో కలసి ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు సోమవారం ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆయన న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని నాయకులు వ్యక్తం చేశారు. మేఘదాతులో డ్యాంల నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమైన విషయం తెలిసిందే. డ్యాంల నిర్మాణానికి అడ్డుకట్ట, కడలిలో జాలర్లకు భద్రత, ముల్లైపెరియార్ డ్యాం హక్కుల పరిరక్షణ, శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలన్నీ ఢిల్లీ వెళ్లేందుకు సోమవారం ఉదయాన్నే సిద్ధమయ్యాయి.

 

 డీఎండీకే నేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్ నేతృత్వంలో ఆరు గంటలకు చెన్నై నుంచి ఢిల్లీకి బృందం బయలు దేరింది. డీఎంకే తరఫున ఎంపీలు కనిమొళి, తిరుచ్చి శివ, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ తరఫున నాసే రామచంద్రన్, గోపన్న, తమిళ మానిల కాంగ్రెస్ తరఫున సీఆర్ బాల సుబ్రమణ్యం, ఎండీఎంకే నుంచి గణేష్‌మూర్తి, ఐజేకే తరఫున ఆ పార్టీ నేత పచ్చముత్తు, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం ఉన్నారు. 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో ఈ బృందం భేటీ అయింది. కర్ణాటక కుట్రలను అడ్డుకోవాలని, డ్యాంల నిర్మాణానికి అనుమతి ఇవ్వొదని విన్నవించారు. కావేరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు కావేరి అభివృద్ధి మండలి, కావేరి జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కావేరి జలాల మీద ఆధారం పడ్డ జిల్లాలు, అన్నదాతల పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.

 

 న్యాయం చేస్తారని ఆశాభావం..

 తమిళనాడులోని అన్నదాతలకు ప్రధాని నరేంద్రమోదీ న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని భేటీ అనంతరం నాయకులు వ్యక్తం చేశారు. కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, నాయకులు విజయకాంత్, తిరుచ్చి శివ, పచ్చముత్తు, తమిళిసై  సౌందరరాజన్, ఏసీ షణ్ముగం తదితరులు మీడియాతో మాట్లాడారు. విజయకాంత్ మాట్లాడుతూ తమిళనాడులోని పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించామన్నారు. జాలర్ల సమస్యలను వివరించి, వారికి భద్రత కల్పించాలని కోరామని తెలిపారు. తమిళులకు తప్పకుండా న్యాయం చేస్తానన్న భరోసాను ప్రధాని మోదీ ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించడంతో ఒకానొక సందర్భంలో ఆయన అసహనానికి గురై బయటకు వెళ్లిపోయారు. ఆయన్ను పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం, డీఎండీకే యువజన నేత సుదీష్ బుజ్జగించక తప్పలేదు. విజయకాంత్ రాజకీయ స్టంట్ చేస్తున్నారని అన్నాడీఎంకే నేతలు ఎద్దేవా చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top