కోర్టు బోనెక్కిన హాస్యనటులు

కోర్టు బోనెక్కిన హాస్యనటులు


చెన్నై: ఎట్టకేలకు హాస్యనటుడు వడివేలు, సింగముత్తులు గురువారం కోర్టు బోనులో నిలబడ్డారు. వీరిద్దరి కేసు చాలా కాలంగా చెన్నై హైకోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. వడివేలు, సింగముత్తు ఒకప్పుడు మంచి స్నేహితులు. ఆ తరువాతే స్థలం కొనుగోలు వ్యవహారంలో శత్రువులుగా మారి ఒకరినొకరు విమర్శించుకున్నారు.నటుడు వడివేలుతో సింగముత్తు తాంబరం సమీపంలో కొంత స్థలాన్ని కొనిపించారు. అయితే ఆ స్థలాన్ని నకిలీ దస్తావేజులతో కొనిపించి సింగముత్తు తనను మోసం చేశాడని వడివేలు చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు చాలాకాలంగా హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నెల 7వ తేదీన నటులు వడివేలు, సింగముత్తు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి మురళీధరన్‌ ఆదేశాలు జారీ చేసినా వారు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి 20వ తేదీన కోర్టుకు హాజరు కాని పక్షంలో వడివేలు, సింగముత్తులపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయనున్నట్లు హెచ్చరించారు.దీంతో నిన్న వడివేలు, సింగముత్తు ఇద్దరు హైకోర్టులో హాజరయ్యారు. కాగా ఈ స్థల మోసం వ్యవహారంలో ఈ నటులిద్దరూ చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా  పరిష్కరించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా,  అలాంటిదేమి జరగలేదని తెలియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

Back to Top