రాజన్నకు సలాం

Today Mahaneta YSR Jayanthi - Sakshi

నేడు మహానేత జయంతి
తమిళనాడు రాజకీయాలతో వైఎస్‌కు ఎనలేని అనుబంధం

అపరభగీరథుడిగా, రైతుబాంధవుడిగా జనహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జననేత వైఎస్సార్‌.  తమిళనాడులోని రాజకీయనేతలతో కూడా ఆ మహానేత సన్నిహితంగా మెలిగారు.  రాజన్న  సంక్షేమ పథకాల్ని ఇక్కడి నేతలు అనుకరించడం విశేషం.

సాక్షి, చెన్నై: సంక్షేమమే శ్వాసగా, పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగి జనహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు వైఎస్సార్‌.  తమిళనాడులోని రాజకీయనేతలతో కూడా ఆ మహానేత సన్నిహితంగా మెలిగారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రాజన్న ప్రవేశపెట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాల్ని ఇక్కడి నేతలు అనుకరించడం విశేషం. ఆయన దూరమైనా, ఆయన జ్ఞాపకాలు ఇక్కడున్న ప్రతి అభిమాని గుండెల్లో మెదులుతూనే ఉంటాయి. రైతు బాంధవుడిగా, జలయజ్ఞ ప్రధాతగా, పేదల పెన్నిధిగా ప్రతి తెలుగు వాడి గుండెల్లో గూడు కట్టుకున్న మహానాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి 68వ జయంతిని పురస్కరించుకుని చెన్నైతో దివంగత నేతకు ఉన్న అనుబంధాన్ని ఓ మారు గుర్తు చేసుకుందాం....

చెన్నైతో బంధం:  పరిపాలనాదక్షుడిగా, అపారమైన నమ్మకానికి నిదర్శనంగా, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, చేయని వాగ్దానాలను సైతం దిగ్విజయవంతంగా అమలు చేసిన మహానేత రాజన్నకు చెన్నైతో విడదీయని బంధం ఉందని చెప్పవచ్చు. నాయకుడిగా  ఎన్నోసార్లు ఆయన చెన్నైకు వచ్చినా, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా 2004లో అడుగు పెట్టారు.  2006లో మరోమారు వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో కల్యాణ మండపం, అతిథి గృహాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఇక,  2007 జూలైలో చెన్నై వేదికగా జరిగిన అఖిల భారత తెలుగు మహాసభకు హాజరై, ఇక్కడున్న తెలుగు వారికి తాను ఉన్నానన్న భరోసా ఇచ్చారు. 2009 జనవరిలో జరిగిన ప్రవాస భారతి దివాస్‌లో ముఖ్య ప్రసంగీకుడుగా హాజరయ్యారు. ఇక, చెన్నైలోని  తెలుగు వారి సమస్యల్ని, తెలుగు భాషా పరిరక్షణకు మహానేత బీజం వేశారు. తెలుగు వారిలో సమైఖ్యతను చాటే విధంగా తెలుగు అకాడమీ నిర్మాణానికి అడుగులు వేశారు.  స్థలం కేటాయించాలంటూ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి విజ్జప్తి కూడా చేశారు. అయితే, అకాడమీ అన్నది నెర వేరని కలగా మారింది.  చెన్నై మహానగరాన్ని అమితంగా ఇష్టపడే వైఎస్‌ తమిళుల సంప్రదాయ ఆహారమైన ఇడ్లీ, సాంబారును మరింతగా ఇష్టపడతారన్న విషయం కొందరికి మాత్రమే తెలుసు.

పెద్దాయన నిను మరువం:  2009 ఆగస్టులో చెన్నై  పర్యటనకు మహానేత రావాల్సి ఉన్నా, అనివార్య కారణాలతో రద్దు అయింది. మళ్లీ ఏదో ఒక రోజు వస్తారన్న ఎదురుచూపు చివరకు జ్ఞాపకమే. 2009 సెప్టెంబర్‌ రెండో తేదీ మహానేత ఎక్కిన హెలికాప్టర్‌ కన్పించకపోవడంతో ఆంధ్ర రాష్ట్రంతో పాటు చెన్నైలోని తెలుగు హృదయాలు తల్లడిల్లాయి. ఆయన ఇక లేరన్న సమాచారం చెన్నపట్నం కన్నీళ్లు పెట్టింది. జనహృదయంలో  గూడు కట్టి...చిరునవ్వు నవ్వి... చిరుదీపాలు వెలిగించి కానరానిలోకాలకు ఆ మహనీయుడు వెళ్లినా, ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయంగానే ఉన్నాయి.  

రాజన్న ఆదర్శంగా..
చెన్నై వాసులతోనే కాదు, తమిళనాడు రాజకీయాలతో వైఎస్సార్‌కు ఎనలేని అనుబంధం ముడిపడి ఉందని చెప్పవచ్చు. తన పథకాలతో పక్క రాష్ట్రాలను సైతం ఆకర్షించిన వ్యూహకర్త వైఎస్సార్‌. ఇందులో పేదల పాలిట ఆపన్నహస్తంగా కొనసాగిన ఆరోగ్యశ్రీ వైద్య బీమా పథకాన్ని, తమిళనాడులోనూ అమల్లోకి తీసుకు రావడమే. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి మడమ తిప్పని నైజాన్ని కల్గిన వైఎస్‌ స్థైర్యాన్ని గుర్తు చేయడం విశేషం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top