ముళ్ల పందికి బలైన పులి

ముళ్ల పందికి బలైన పులి


చెన్నై: పులి ఏ జంతువునైనా సులువుగా వేటాడి తినగలదు. కానీ ఓ పులి ఆహారం కోసం వేటాడి తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. ముళ్ల పందిని వేటాడి తిన్న పులి తీవ్రగాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులోని కుమరి జిల్లా పేచ్చిపారై అనై ప్రాంతం సమీపంలో చోటు చేసుకుంది. గురువారం కాయల్‌కరై అటవీ ప్రాంతానికి వెళ్ళిన కొంత మంది స్థానికులు అక్కడ నాలుగేళ్ల ఆడ పులి మృతి చెంది ఉండటం చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.


ఈ మేరకు అధికారులు పశువుల డాక్టర్లతో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని పులి కళేబరాన్ని పరిశీలించగా రాత్రి వేళ ఆహారాన్ని వెతుకుంటూ వచ్చిన పులి అక్కడ తిరుగుతున్న ముళ్ల పందిని వేటాడి చంపేసిందని.. తినే క్రమంలో ముళ్ల పందికి ఉన్న ముళ్లు గుచ్చుకోవడంతో పులి నోరుతోపాటు కడుపులో బలమైన గాయాలు ఏర్పడ్డాయని వివరించారు. ఆ ముళ్లు పులి పేగులను కూడా చీల్చేశాయని తెలిపారు.. దీంతో పులి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు స్పష్టం చేశారు.

Back to Top