బూచాడమ్మా బూచాడు..!

thieves gangs in tamilnadu - Sakshi

కాంచీపురం: కంచిలో కూలీ పనుల కోసం వచ్చిన ఇద్దరు ఉత్తరాది వాసులను పిల్లలను కిడ్నాప్‌ చేసే ముఠా అని భావించి స్థానికులు చితకబాదారు. ఆ సమయంలో ఒక వ్యక్తి పారిపోగా, సమీపం ప్రాంతానికి చెందిన ఒక ఆటో డ్రైవర్‌ను చూసిన స్థానికులు పారిపోయిన ఉత్తరాది వ్యక్తిగా భావించి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన కాంచీపురంలో ఆదివారం రాత్రి కలకలం రేపింది. 

వాట్సప్‌లో వార్తలు హల్‌చల్‌:
ఉత్తరాదికి చెందిన దొంగల ముఠా కాంచీపురంలో హల్‌ చేస్తోంది. ఆ ముఠా చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేస్తున్నారు. మీ పిల్లలు జాగ్రత్తా అంటూ మూడు రోజులుగా వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

అనుమానంతో చితకబాదుడు:
పెరియకాంచీపురం, పిల్లయార్‌ పాళయం సమీపంలో తాయారమ్మన్‌ కుళం వీధిలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు సందేహాస్పదంగా కనిపించారు. వారిని స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలిచ్చారు. దీంతో వారు చిన్నారులను కిడ్నాప్‌ చేసేందుకు వచ్చి ఉంటారని భావించి స్థానికులు వారిని చితకబాదారు. ఆ సమయంలో ఓ వ్యక్తి పరారయ్యాడు.పట్టుబడిన యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో అతడు హర్యానాకు చెందిన అస్రిత్‌ గుజీర్‌ అని, పారిపోయిన వ్యక్తి రామ్‌గోపాల్‌ అని తెలిపాడు. తాము కూలి పని చేసుకునేందుకు కాంచీపురం వచ్చినట్టు అస్రిత్‌ గుజీర్‌ తెలిపినట్లు పోలీసులు వెల్ల డించారు. 

గంట సేపట్లో మరో ఘటన: 
గంట వ్యవధిలోనే అక్కడి సమీపంలోని తిరువెట్రీశ్వరర్‌ వీధిలోని, కలెక్టర్‌ కార్యాలయం వద్ద తాయారమ్మన్‌ కుళం వీధిలో ఓ వ్యక్తి ఆటో నిలిపి ఉండడం స్థానికులు గమనించారు. అతనిపై సందేహం ఏర్పడడంతో, పిల్లయార్‌ పాళయంలో తప్పించుకుపోయిన ఉత్తరాది వాసి ఇతనేనని భావించి చితకబాదారు. తాను ఆటో డ్రైవర్‌ను అని చెప్పి ఎంత మొత్తుకున్నా వినలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ ప్రాంతానికి సమీపంలోని ఆలడిపిల్లయార్‌ తోప్పు వీధికి చెందిన రాజన్, భువనేశ్వరి దంపతులు కుమారుడు దీపక్‌ (20), ఆటో డ్రైవర్‌ అని తేలింది. పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఆవేశం వద్దు.. ఎస్పీ దండోరా:
కాంచీపురం ఎస్పీ సంతోష్‌ అదమని సోమవారం కాంచీపురం, పరిసర ప్రాంతాల్లో మైక్‌ సెట్‌తో ఆటో ద్వారా దండోరా వేయించారు. పిల్లలను కిడ్నాప్‌ చేసే ఉత్తరాది ముఠా వచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వైరల్‌ అవుతోంది. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించండి. ఆగ్రహంతో దాడి చేయవద్దు అని దండోరా వేయించారు. 
 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top