రూపను బదిలీ చేయడం దారుణం: యెడ్డీ

రూపను బదిలీ చేయడం దారుణం: యెడ్డీ


న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప సోమవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. జైళ్ల శాఖ డీఐజీ రూప బదిలీ వ్యవహారంపై ఆయన ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో చర్చించారు. భేటీ అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ... డీఐజీ రూపను బదిలీ చేయడం దారుణమని, నిజాయితీపరులైన ప్రభుత్వ అధికారులకు రాష్ట్రంలో భద్రత లేదని వారిని సిద్ధరామయ్య సర్కార్‌ శిక్షిస్తోందన్నారు. డీజీపీకి రూప ఇచ్చిన నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యలపై విచారణ జరిపించాలని, మంగళూరులో వెంటనే ఎన్‌ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలన్నారు.


మరోవైపు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు సూపరిండెంటెంట్‌ కృష్ణ కుమార్‌పై కూడా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ఆర్‌.అనిత నియమితులయ్యారు. కాగా డీఐజీ రూప బదిలీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. సాధారణ బదిలీల్లో భాగంగా రూప బదిలీ జరిగిందని, అందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు.కాగా అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన జైళ్ల శాఖ డీఐజీ రూప పై బదీలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఆమెను జైళ్లశాఖ నుంచి ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని డీఐజీ రూప డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది.

Back to Top