తాప్సీ వెడ్డింగ్ ఫ్యాక్టరీ

తాప్సీ వెడ్డింగ్ ఫ్యాక్టరీ - Sakshi


తాప్సీ వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనగానే ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆడ వారి మాటలకు అర్థాలే వేరు అన్నాడో కవి. ఆ మాటలు అక్షర సత్యాలు. ముఖ్యంగా మన హీరోయిన్లు చెప్పేవాటికి.. చేసే వాటికి అసలు పోలిక ఉండవు. డబ్బు ప్రధానం కాదంటారు. మంచి పాత్రలే ముఖ్యమంటారు. వాస్తవానికి వస్తే ధనార్జనే ధ్యేయంగా వారి చర్యలు ఉంటాయి. సినిమాల్లో లక్షలకు లక్షలు గడిస్తున్నా, ఇతర ఆదాయాలపై ఆరాట పడుతుంటారు.

 

 నటి త్రిష సైడ్ బిజినెస్‌గా హోటల్ నడుపుతున్నారు. అలాగే, నటి తమన్న ఇటీవలే నగల వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇక నటి నమిత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీ అయ్యారు. ఇలా పలువురు నటీ మణులు నటనతో పాటుగా ఇతర వ్యాపారాల్లోనూ చేతి నిండా ఆర్జిస్తున్నారు. తాజాగా, ఈ కోవలోకి నటి తాప్సీ చేరారు. ఆడుగలం చిత్రంలో కోలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీకి ఇక్కడ అవకాశాలు అంతంత మాత్రమేనని చెప్పాలి. యువ నటుడు జయం రవి, జీవా, ధనూష్ లాంటి వారి సరసన నటించినా, విజయాలు మాత్రం పొందలేక పోయారు.

 

  అజిత్ చిత్రం ఆరంభంలో నటించినా, ఆ చిత్ర విజయం నయనతార ఖాతాలోకి చేరింది. అలా.. పోరాడి పోరాడి చివరకు కాంచన -2తో తాప్సీ మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం శింబు తాజా చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లిళ్లుచేసే పనిలో పడ్డారు. అర్థం కాలేదా.. తన చెల్లెలు స్నేహితురాలితో కలిసి మ్యారేజీ క్యాటరింగ్‌ను ప్రారంభించారు. దీని ద్వారా వివాహానికి సంబంధించిన సరంజామాను సమకూరుస్తారట .

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top