కమలంతో ఢీ

కమలంతో ఢీ


►  డీఎంకే కసరత్తు

►  చెన్నైలో ‘మహా’ ర్యాలీ సన్నాహాలు

►  లాలు, మమత రాక

►  కేంద్రంపై స్టాలిన్‌ విమర్శల జోరు




తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కేంద్రంలోని కమలం సర్కారును ఢీ కొట్టేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ కసరత్తుల్ని వేగవంతం చేస్తూ చెన్నై వేదికగా మహా ర్యాలీకి సన్నాహాల్లో పడ్డారు. ఇందులో ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తదితర నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, కేంద్రంతో ఢీ కొట్టే విధంగా విమర్శలు, ఆరోపణల దాడిని పెంచే పనిలో స్టాలిన్‌ నిమగ్నం అయ్యారు. తమిళప్రజలతో చెలగాటాలు వద్దంటూ బుధవారం కేంద్రాన్ని ఆయన హెచ్చరించడం గమనార్హం.



సాక్షి, చెన్నై :  రాష్ట్రంలో సాగుతున్న అన్నాడీఎంకే రాజకీయ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, సీఎం పళని స్వామి ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో ఉంచుకుని కేంద్రంలోని మోదీ సర్కారు నడిపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూరే రీతిలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పవచ్చు.అన్నాడీఎంకేని అడ్డం పెట్టుకుని తమిళనాట పాగా వేయడానికి వ్యూహరచనల్లో ఉన్న బీజేపీకి ఆదిలోనే చెక్‌ పెట్టడం లక్ష్యంగా స్టాలిన్‌ ఎత్తుకు పైఎత్తు వేయడానికి సిద్ధం అయ్యారు.



కేంద్రంపై విమర్శల్ని ఎక్కుబెట్టడంతో పాటు, సమరానికి సై.. అన్నట్టు ఢీకొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ నేతృత్వంలో ప్రధాని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా పాట్నాలో మహా ర్యాలీ సాగిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ ర్యాలీని తలదన్నే రీతిలో చెన్నై వేదికగా మహా ర్యాలీకి స్టాలిన్‌ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.



తమిళనాట సాగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రం జోక్యం, కేంద్రం కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారాలు, ప్రధాని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా తమిళ ప్రజల్ని ఏకం చేసే రీతిలో, ఇక్కడి పరిస్థితులు జాతీయ స్థాయిలో చర్చ సాగే విధంగా ఈ మహా ర్యాలీకి స్టాలిన్‌ కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు తగ్గ చర్చ మంగళవారం నాటి డీఎంకే సమావేశంలో వచ్చినట్టు సమాచారం. ఈసమావేశానికి లాలూ, మమత తదితర ప్రతిపక్షాల నేతల్ని ఆహ్వానించి కేంద్రంతో ఢీ కొట్టేందుకు స్టాలిన్‌ దూకుడు పెంచే పనిలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మహా ర్యాలీ పిలుపునకు తగ్గ అధికారిక ప్రకటన మరి కొద్ది రోజుల్లో వెలువడనున్నట్టు చెబుతున్నారు. కాగా, కావేరి వ్యవహారంలో కోర్టు కేంద్రానికి అక్షింతలు వేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న స్టాలిన్‌ బుధవారం తన స్వరాన్ని పెంచడం గమనార్హం.



కేంద్రంపై ఆగ్రహం

కావేరి జలాల మీద తమిళులకు ఉన్న హక్కుల్ని కాల రాసే ప్రయత్నాలు సాగిస్తే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు సైతం అక్షింతలు వేయడాన్ని బట్టి చూస్తే, కేంద్రం నాటకాలు ఏమేరకు సాగుతున్నాయో, ఇక్కడి పాలకులు ఏమేరకు అందుకు తగ్గట్టు నటిస్తున్నారో స్పష్టం అవుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కావేరి నీళ్లు కరువుతో డెల్టా అన్నదాతలు కన్నీటి మడుగులో మునిగి ఉన్నారని, వారి జీవితాల్ని, వ్యవసాయ మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ కేంద్రం కుట్రలు సాగిస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమిళ ప్రజలతో చెలగాటాలు వద్దు అని హెచ్చరించారు.



కావేరి ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేయక పోగా, హక్కుల్ని కాలరాసే విధంగా ఎత్తుగడులు సాగిస్తే, తమిళ ప్రజలు ఎన్నడూ క్షమించరని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం మళ్లీ  జరగాల్సిన డీఎంకే ఎమ్మెల్యేల సమావేశాన్ని స్టాలిన రద్దుచేశారు. ఇందుకు కారణం, కోర్టు నుంచి ఎలాంటి వ్యతిరేక నిర్ణయాలు వెలువడకపోవడమే. ఒకవేళ కోర్టునుంచి తమకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడి ఉంటేæ, ఈ సమావేశానంతరం ఎమ్మెల్యేలందరూ జైల్‌ భరోతో ముందుకు సాగి, తదుపరి రాజీనామాలు చేసి ఉండే వారని చెప్పవచ్చు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top