వీడియో కలకలం!


సాక్షి, చెన్నై: శ్రీలంకలో యుద్ధం పేరుతో జరిగిన మారణ హోమంలో వేలాది మంది ఈలం తమిళులు హతం అయ్యారు. లక్షలాది మంది స్వదేశంలోనే శరణార్థులుగా మిగిలారు. మరెందరో ఇతర దేశాల్లో తలదాచుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఈలం తమిళుల సంక్షేమ నినాదం మిన్నంటింది. వారికి సమాన అవకాశాలు కల్పించాలని, వారి వారి గ్రామాల్లోకి మళ్లీ అనుమతించాలని, నివాస గృహాలు కల్పించాలని, ఇలా అనేక రకాల డిమాండ్లతో రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి.   శ్రీలంకలో జరిగిన మారణ హోమం, సింహళీయ సైన్యం కిరాతకత్వానికి అద్దం పట్టే దృశ్యాలు, వీడియో ఆధారాలు రోజుకొకటి బయట పడుతున్నాయి. తమ సోదరులను ఇంత కిరాతక ంగా కడతేర్చారా... అన్న ఆక్రోశానికి ప్రతి తమిళుడు గురయ్యే రీతిలో ఆ దృశ్యాలు ఉన్నాయి. దీంతో రాజపక్సేను యుద్ధ ద్రోహిగా అంతర్జాతీయ న్యాయస్థానం బోనులోకి ఎక్కించడం లక్ష్యంగా నినాదం తెరపైకి వచ్చింది.  ఇదే నినాదంతో గత ఏడాది నెలల తరబడి ఉద్యమం సాగింది. విద్యార్థుల ఆందోళనతో కేంద్రం దిగి వచ్చినా, శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా తెచ్చిన తీర్మానం వీగి పోయేలా భారత్ వ్యవహరించింది. ఇందుకు ప్రతి ఫలంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయడం లక్ష్యంగా ఇక్కడి పార్టీలు, తమిళ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. 


 


 వరుస ప్రసారాలు: ఎల్‌టీటీఈ నేత బాలచందరన్‌ను అతి కిరాతకంగా కడతేర్చిన దృశ్యాలు వెలుగు చూసిన కొన్ని నెలల్లో ఎల్‌టీటీఈ టీవీ చానల్ ప్రతినిధి ఇసై ప్రియ హత్య దృశ్యాల్ని బ్రిటన్‌కు చెందిన చానల్ -4 ప్రసారం చేసింది. తమిళులపై లంక సేనల అత్యాచార దృశ్యాలు, పైశాచికానంద దృశ్యాలన్నింటీని వరుస పెట్టి ఈ చానల్ ప్రసారం చేస్తూనే వస్తున్నది. దీంతో ప్రపంచ దేశాల్లోని తమిళులు కదిలారు. అనేక దేశాల ప్రభుత్వాలు సైతం శ్రీలంకపై ఆక్రోశంతోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల వేళ ఆ చానల్‌కు సరికొత్త వీడియో దొరికిం ది. భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి ఆ దృశ్యాలు ప్రసారం అయ్యాయి. ఆరు నిమిషాల నిడివితో ప్రసారమైన దృశ్యాలు ఈలం తమిళుల్నే కాదు మనిషి అన్న ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించక మాన లేదు. ఛిద్రమైన ఈలం తమిళుల శరీరాలు, చిన్న పిల్లల మృత దేహాలను కాళ్లతో తన్నుతున్న లంక సేన, తమిళ మహిళపై వస్త్రాల్లేని దృశ్యాలు, కొందరి మహిళల వస్త్రాలను లంక సేనలు తొలగిస్తున్నట్టు, పక్కనే ఉన్న సహచర సేనలు ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టు ఆ దృశ్యాలు ఉన్నాయి. హృదయ విదారకరంగా పడి ఉన్న  స్త్రీల నగ్న మృత దేహాలను లంక సైనికుడు తన కెమెరాలో బంధిస్తూ పైశాచికానందం పొందుతున్న దృశ్యాలు తమిళాభిమానుల్ని కలచివూ శారుు. 


 


 ఈ దృశ్యాలు తమిళాభిమాన సంఘాలను, పార్టీలను తీవ్ర మనో వేదనకు గురి చేయడంతోపాటుగా లంక ఆధిపత్యంపై తీవ్ర ఆక్రోశం రగులుతున్నాయి. ఆగ్రహ జ్వాల: గతంలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు జెనీవా వేదికగా ఆరంభం అయ్యాయి. ఇందులో శ్రీలంకను బోనులో ఎక్కించే విధంగా మరో తీర్మానాన్ని అమెరికా ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో పాటుగా భారత్ సైతం ప్రత్యేక తీర్మానం ప్రవేశ పెట్టాలన్న డిమాండ్ రాష్ట్రంలో ఉంది. కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా రాజుకుం టున్న నిరసనలు తాజా వీడియోతో మరింత రగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికల వేళ తమిళుల మద్దతు కూడగట్టుకోవడానికి, ఈ వీడియో ఆధారంగా కేంద్రంతో ఢీ కొట్టేందుకు రాజకీయ పక్షాలు సిద్ధం అవుతున్నాయి. కేంద్రం ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌తో తమిళ సంఘాలన్నీ ఏకం అవుతున్నాయి. తాము సైతం అని రాజకీయ పక్షాలు కదులుతున్నాయి. 


 


 పీఎంకే, ఎండీఎంకే నేతలు రాందాసు, వైగో వేర్వేరుగా  ఆ వీడియో దృశ్యాలపై స్పందించారు. రాజపక్సేను బోనులో ఎక్కించేందుకు ఇదే అదను కావడంతో అన్ని పక్షాలు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. ఇక నైనా రాజపక్సేను, లంక సేనలను క్షమించొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తమిళాభిమానులందరూ ఏకం కావాలని కేంద్రంపై ఒత్తిడి పెంచి రాజపక్సేను బోనులో నిలబెడదామని పిలుపునిచ్చారు. వీడియో కలకలం రేపినప్పుడల్లా  రోజుకో పార్టీ నేతృత్వంలో నిరసనలు రాష్ట్రంలో చోటు చేసుకోవడం పరిపాటే. అందరి ప్రతాపం నుంగబాక్కంలోని శ్రీలంక దౌత్య కార్యాలయం మీదే ఉంటుంది. దీంతో ఆ కార్యాలయం పరిసరాలను నిఘా వలయంలోకి తెచ్చారు. నుంగంబాక్కం పరిసరాల్లో నిరసనలు, ఆందోళనలకు నిషేధం విధించారు. ఇక, శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానానికి పట్టుబడుతూ తంజావూరులోని ముల్లివాయ్‌క్కాల్ స్మారక ప్రదేశంలో చెన్నైకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. దీంతో విద్యార్థుల ఉద్యమం రాజుకోవడం తథ్యం.  


 


 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top