అట్టుడుకుతున్న దక్షిణ కర్ణాటక

అట్టుడుకుతున్న దక్షిణ కర్ణాటక

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడూ శాంతియుత పరిస్థితులుండే దక్షిణ ప్రాంతం ఇప్పుడు మత ఉద్రిక్తలతో అట్టుడికిపోతోంది. బంట్‌వాల్‌ తాలూకాలో గత 50 రోజుల నుంచి కొనసాగుతున్న నిషేధాజ్ఞలను ఆదివారం నాడు మంగళూరుకు కూడా పొడిగించారు. 144వ సెక్షన్‌ కింద విధించిన ఈ నిషేధాజ్ఞలు మరో రెండు వారాలపాటు కొనసాగుతాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. గత మూడు నెలలుగా కొనసాగుతున్న మత ఉద్రిక్తలలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. 



బంట్‌వాల్‌లో గత మే 26వ తేదీన ఓ ముస్లిం యువకుడిని కత్తితో పోడవడంతో మత ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో మొదటిసారి బంట్‌వాల్‌లో నిషేధాజ్ఞలు విధించారు. జూన్‌ 21వ తేదీన సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఆటో డ్రైవర్‌ ఆష్రాఫ్‌ కలాయ్‌ (35)ని గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఆటో నుంచి బయటకులాగి హత్యచేశారు. జూలై 4వ తేదీన శరత్‌ మడివాలా అనే ఆరెస్సెస్‌ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా కట్టారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆయన గాయాలతో మరణించారు. ఈ మూడు సంఘటనల్లో ప్రతి సంఘటన కూడా మత ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆరెస్సెస్‌ కార్యకర్త హత్యానంతరం ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. జూలై 8 తేదీన ఆయన నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న హిందువులు రాళ్లు, సీసాలు విసిరారు. 

 

ఉత్తరప్రదేశ్‌లోలాగా కర్ణాటకలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని బీజేపీ, ఆరెస్సెస్‌ పార్టీలు రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు సష్టిస్తున్నాయని కాంగ్రెస్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అల్లర్లతో సంబంధం ఉన్న ఆరెస్సెస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగంగా పిలుపునివ్వడం, ఎలా అరెస్ట్‌ చేస్తారో చూస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సవాల్‌ చేయడం తెల్సిందే. తాను అసలు సిసలైన హిందువునని, తన పేరు సిద్ద రాముడని, బీజేపీ దొంగ హిందూ సిద్ధాంతమని కూడా ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. వీరి సవాళ్లు, విమర్శలు ఎలా ఉన్నా అల్లర్లు ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా అల్లర్లకు దారితీసిన ఒక్క సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇంతవరకు ఒక్క అరెస్ట్‌ కూడా చేయలేదు. 



నిందితులపై కేసులు దాఖలు చేయనప్పుడు, అరెస్ట్‌లు చేయనప్పుడు అల్లర్లు సమసిపోకపోవడమే కాకుండా మరింత పెరుగుతాయి. అల్లర్ల పేరిట సంఘ విద్రోహ శక్తులు మరింత పేట్రేగిపోయే ప్రమాదం ఉంటుంది. మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ నిర్వహించనున్న శాంతి ప్రదర్శనలో పాల్గొనాలంటూ కాంగ్రెస్, బీజేపీలకు జనతాదళ్‌ (సెక్యులర్‌) నాయకుడు కుమార స్వామి పిలుపునిచ్చారు. శాంతి ప్రదర్శనలో పాలక, ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా పాల్గొని తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top