ర్యాలీ భగ్నం .. ఆరంభంలోనే అడ్డుకున్న పోలీసు యంత్రాంగం


 భివండీ, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్లిప్త ధోరణిని నిరసిస్తూ పట్టణం నుంచి ముంబైలోని మంత్రాలయదాకా బుధవారం తలపెట్టిన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వస్త్ర పరిశ్రమల యజమానులు ఇటీవల కొద్దిరోజులపాటు బంద్ పాటించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో భివండీ పవర్‌లూమ్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు, ఎంపీ సురేష్ టావ్‌రే నేతృత్వంలో మరమగ్గాల యజమానులు స్థానిక ఆనంద్  దిఘే చౌక్ నుంచి ముంబైలోని మంత్రాలయదాకా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం తొమ్మిది గంటలకు పరిశ్రమల యజమానులంతా ఆనంద్ దిఘే చౌక్ వద్దకు వచ్చారు. అయితే ర్యాలీని ప్రారంభించకముందే అక్కడికి చేరుకున్న వారందరినీ పోలీసులు చెదరగొట్టారు. దీంతో యజమానులంతా ఎంపీ సురేష్ టావ్‌రే నివాసం వద్దకు వెళ్లి ఘెరావ్ చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే రషీద్ తాహిర్ మోమిన్, మహేంద్ర గైక్వాడ్ తదితరులు పోలీసు బందోబస్తుతో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రషీద్ మాట్లాడుతూ వచ్చే నెల నాలుగో తేదీలోగా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే ఆ మరుసటి రోజు ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను సోమవారం కలసి నివేదికను అందజేశామన్నారు.

 విద్యుత్ శాఖ మంత్రి అజిత్ పవార్‌ను కలవాలంటూ సీఎం సూచించారని, దీంతో మళ్లీ మంగళవారం అజిత్‌తోపాటు జౌళిశాఖ మంత్రితోనూ సమావేశమయ్యామన్నారు. ఇందుకు స్పందించిన మంత్రులు త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు.  దీంతో మరమగ్గాల యజమానులు శాంతించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top