తలైవా ‘పార్టీ’!

తలైవా ‘పార్టీ’! - Sakshi


ఢిల్లీలో కసరత్తు

న్యాయ నిపుణులతో కమిటీ

రాష్ట్ర, జాతీయ స్థాయిలో సిద్ధాంతాల రూపకల్పన

చాప కింద నీరులా కార్యాచరణ




‘తలైవా’ రజనీ రాజకీయ అరంగేట్ర సమయం ఆసన్నం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పార్టీతో తమిళ ప్రజల్లోకి ఆయన వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఇందుకు ఢిల్లీ వేదికగా కసరత్తులు వేగం పెరిగింది. చాప కింద నీరులా న్యాయ నిపుణుల కమిటీ రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో సిద్ధాంతాలు, విధి విధానాల రూపకల్ప నలో బిజీగా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.



సాక్షి, చెన్నై :  దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ రాజకీయ అరంగ్రేటం చర్చగానే మిగిలిన విషయం తెలిసిందే. అభిమానులతో భేటీలు సాగించినా, యుద్ధానికి సిద్ధం అయ్యే రీతిలో పిలుపునిచ్చినా కథానాయకుడు రూటే సపరేటు. తమిళనాట ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ మద్దతు పలికే వాళ్లూ ఎక్కువే.



అయితే, తలైవా మాత్రం ‘కాలా’తో రాజకీయ సందేశాన్ని ఇచ్చే రీతిలో షూటింగ్‌ బిజీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా రాజకీయ చర్చ ఊపందుకున్నా, కాలా బిజీ రూపంలో అది కాస్త సద్దుమణిగిందని చెప్పవచ్చు. అయితే, ఓవైపు కాలా బిజీలో ఉంటూనే, మరో వైపు చాప కింద నీరులా సూపర్‌ స్టార్‌ తనదైన శైలిలో రాజకీయ కసరత్తుల్లో దూసుకెళ్తున్నట్టుగా సమాచారం.



సెంటిమెంట్‌

రజని తొలి చిత్రం అపూర్వరాగంగల్‌ ఆగస్టు 15వ తేదీన ఒకప్పుట్లో విడుదల అయిందని చెప్పవచ్చు. తదుపరి సినీ రంగంలో అదృష్టం కలిసి రావడంతో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు సూపర్‌ స్టార్‌ అయ్యారు. అందుకే  ఈ ఆగస్టు పదిహేనున రజనీ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఆ సంఘాల నేతలు వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.  అలాగే, ఈనెల 22న రాష్ట్రంలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీకి సైతం రజనీ నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. అదే సమయంలో రజనీ రాజకీయ పార్టీ వ్యవహారం బీజేపీ కనుసన్నల్లోనే సాగుతున్నట్టుగా మరో ప్రచారం ఊపందుకుంది. తమిళనాట బీజేపీ పాదం మోపడం ఇప్పట్లో కష్టతరం అన్న విషయం తెలిసిందే.



అందుకే  డీఎంకేకు చెక్‌ పెట్టడం లక్ష్యంగా కొత్త పార్టీతో రజనీని తెర మీదకు తెచ్చేందుకు తెర వెనుక నుంచి బీజేపీ పావులు కదుపుతున్నట్టుగా ఆ సంఘాల నాయకులు పేర్కొంటుండటం ఆలోచించ దగ్గ విషయం. రజనీ కొత్త పార్టీ, అన్నాడీఎంకే, బీజేపీల కలయితో డీఎంకేని ఎదుర్కోవడం సులభతరం అవుతుందని అమిత్‌ షా వ్యూహం ఇందులో ఉన్నట్టు సమాచారం. అందుకే అమిత్‌షాతో భేటీ అనంతరం సెప్టెంబరులో రజనీ రాజకీయ ప్రవేశం గురించి అడుగు వేయవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక,  రజనీ జాతకం మేరకు గురు ప్రవేశం అనంతరం పరిస్థితులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయని, ఆయన సెప్టెంబరులో రాజకీయ నిర్ణయం తీసుకోవడం ఖాయం అని జ్యోతిష్కులు సైతం వ్యాఖ్యానిస్తుండడాన్ని బట్టి చూస్తే, త్వరలో తలైవా పార్టీ ఆవిర్భవించేనా అన్నది వేచి చూడాల్సిందే.



సొంత పార్టీనా..

రజనీకాంత్‌ కమలం గూటికి చేరుతారా.. సొంత పార్టీతో ప్రజల్లోకి వస్తారా..? అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో కొత్త పార్టీ కసరత్తులు తెరమీదకు వచ్చాయి. న్యాయ నిపుణులతో కూడిన కమిటీ రజనీ కొత్త పార్టీ కసరత్తుల మీద దృష్టి పెట్టి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో చాప కింద నీరులా పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాల రూపకల్పన మీద ఆ కమిటీ కసరత్తుల్లో ఉన్నట్టుగా వచ్చిన సమాచారం తమిళనాట ఉన్న కథానాయకుడి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ ప్రక్రియ ముగించిన అనంతరం ఎన్నికల కమిషన్‌కు  పార్టీ రిజిస్ట్రేషన్‌ నిమిత్తం దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. ఇక, చెన్నై శివార్లలో ప్రత్యేక సెట్‌లో సాగుతున్న కాలా షూటింగ్‌లో ఓ వైపు రజనీ బిజీగా ఉన్నా,  మరోవైపు షూటింగ్‌ గ్యాప్‌లో తమిళ సంఘాల నేతలు, వెనుకబడిన సామాజిక వర్గాల సంఘాల నాయకులతో మంతనాల్లో మునుగుతున్నట్టు సమాచారం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top