ప్రైవేట్ బస్సు బోల్తా


-నలుగురి par దుర్మరణంఙ-36 మందికి గాయాలు

డ్రైవర్ అజాగ్రత్తే కారణం



సాక్షి, బళ్లారి(దావణగెరె) : దావణగెరె నగరానికి సమీపంలోని వాణి హోండా షోరూం వద్ద ప్రధాన రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చెన్నగిరి నుంచి సంతెబెన్నూరు మీదుగా దావణగెరెకు వస్తున్న గీతాంజనేయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడటంతో నలుగురు ప్రయాణికులు మరణించగా, 36 మంది గాయాలైన ఘటన జరిగింది.



మృతులను తాలూకాలోని గెద్దలహట్టి గ్రామానికి చెందిన ప్రవీణ(23), గుళ్లెళ్లి గ్రామానికి చెందిన ఉమాపతి(51), మేళ్యానాయకనహట్టి గ్రామానికి చెందిన మూర్తి(36), భద్రావతి తాలూకా వీరాపుర గ్రామానికి చెందిన సయ్యద్ ముదసర్(21)లుగా గుర్తించారు. ప్రమాదంలో సిద్దరామప్ప, బీరలింగప్ప, రఫీక్‌ఖాన్, మధుకుమార్, కల్లేశప్ప, శంక్రప్పలతో పాటు సుమారు 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురిని దావణగెరె ఆస్పత్రికి, మిగిలిన వారిని శివమొగ్గలోని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు.



సంతెబెన్నూరు మీదుగా దావణగెరె వైపునకు బస్సుల రాకపోకలు తక్కువగా ఉన్నందున వచ్చే కొన్ని బస్సుల కోసం ప్రయాణికులు కాచుకొని కిక్కిరిసి వెళ్లాల్సి నందున బస్సులోకి ఎక్కువ మంది ఎక్కారని, పైగా లోపల స్థలం లేకపోవ డంతో బస్సు టాప్‌పైకి ఎక్కారని ప్రయాణికులు, అదే సమయంలో బస్సు  డ్రైవర్ తన మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండగా ప్రయాణికులు వారించినా వినకుండా ఫోన్‌లో మాట్లాడుతూ బస్సు నడపడం వల్ల బస్సు అదుపు తప్పి ప్రమాదానికి దారి తీసినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం జరుగుతున్నట్లు గ్రహించిన వెంటనే డ్రైవర్, కండక్టర్లు బస్సులో నుంచి దూకి పారిపోయారు.



ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే పాండోమట్టి విరక్తమఠం శ్రీగురుబసవ స్వామీజీ, మాజీ ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్ప, జిల్లా ఉపవిభాగాధికారి రాగప్రియ, డీఎస్పీ న్యామేగౌడ్రు, తహశీల్దార్ పద్మాకుమారి, సీఐ ఆర్‌ఆర్ పాటిల్ తదితర అధికారులు తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి, అనంతరం క్రేన్ సహాయంతో బస్సును పైకి లేపి పరిస్థితిని చక్కదిద్దారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top