విద్యార్థి హత్య కేసులో అనుమానాలు

విద్యార్థి హత్య కేసులో అనుమానాలు

హత్యకు గురైనట్లు చెబుతున్న అవంతి కాలేజి బీటెక్ విద్యార్థి ప్రదీప్ మృతిపై అతడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలంటూ వాళ్లు అగనంపూడి వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ప్రదీప్ మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి ఆందోళన చేస్తున్నారు. దీంతో వాహనాలు భారీ సంఖ్యలో నిచిలిపోయి అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రదీప్ కనిపించడం లేదని తాము ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రదీప్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

 

వాస్తవానికి ఈ విద్యార్థి విషయంలో.. అతడి స్నేహితుడు చెప్పిన విషయాల ఆధారంగానే వివరాలు తెలియశాయి. స్నేహితురాలితో కలిసి చాట్ బండి వద్ద చాట్ తింటుండగా.. చిన్నా, సాయి అనే ఇద్దరు నిందితులు ప్రదీప్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కొట్టారని అతడి స్నేహితుడు చెప్పాడు. ఆ విషయం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ప్రదీప్ కనిపించని విషయాన్ని అక్టోబర్ 28వ తేదీనే అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని అంటున్నారు. చిన్నా, సాయి అనే ఇద్దరు తీసుకెళ్లారని ముందుగానే చెప్పారని, వాళ్లను తీసుకెళ్లి విచారిస్తే తన కొడుకు ప్రాణాలు పోయేవి కావని ప్రదీప్ తండ్రి అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు సాయిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. చిన్నా విషయం మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు. అతడు కూడా అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో కొన్ని రాజకీయ ఒత్తిడులు కనిపిస్తున్నాయి. నిందితులు ఇద్దరిలో చిన్నా అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటాడు. అతడు ఒక ఎమ్మెల్యేతో కూడా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకే విచారణ సక్రమంగా సాగదని భావించిన బంధువులు.. తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top