‘రజనీ నన్ను మెచ్చుకోవడం చాలా సంతోషం’

‘రజనీ నన్ను మెచ్చుకోవడం చాలా సంతోషం’


చెన్నై:  తమిళనాడు రాష్ట్రంలో మంచి నేతలు ఉన్నారని కొందరి పేర్లను మాత్రమే రజనీకాంత్‌ ప్రస్తావించడం విమర్శలకు దారితీసింది. అయితే మంచి సమర్థుడైన నేతగా రజనీకాంత్‌ తనను మెచ్చుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ హర్షం ప్రకటించారు. కాగా అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలను ఆయన ప్రస్తావించక పోవడం గమనార్హం. ముఖ్యంగా తన రాజకీయ స్నేహితుడు, ప్రధాని మోదీ పేరు సైతం రజనీ నోటి వెంట రాలేదు.అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాని నరేంద్రమోదీని రజనీకాంత్‌ ఎందుకు ప్రశంసించలేదని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ ప్రశ్నించారు. తనపై వచ్చిన ఒక్క విమర్శనే రజనీకాంత్‌ తట్టుకోలేక పోయారు, రాజకీయాల్లోకి వస్తే ఇలాంటివి ఎన్నో భరించాల్సి ఉంటుందని అన్నాడీఎంకే పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి హితవు పలికారు. దేశం మొత్తం మీద తమిళనాడులో మాత్రమే శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయని రజనీకాంత్‌ తెలుసుకోవాలని అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యాలయ అధికార ప్రతినిధి నాంజిల్‌ సంపత్‌ విమర్శించారు. కాగా రజనీకాంత్‌ తన అభిమానులతో ఏర్పాటు చేసిన  ఐదురోజుల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ...‘ప్రస్తుతం నా వయస్సు 67. కర్ణాటకలో నివసించింది కేవలం 23 ఏళ్లు మాత్రమే, తమిళనాడులో 44 ఏళ్లుగా ఉంటున్నాను. కర్ణాటక నుంచి ఒక మరాఠి లేదా కన్నడిగుడిగా తమిళనాడుకు వచ్చినా అభిమానులు నన్ను స్వచ్ఛమైన తమిళుడిగా మార్చివేశారు. రజనీకాంత్‌ ఒక పక్కా తమిళుడు. నా ముత్తాతలు, తల్లిదండ్రులు కృష్ణగిరి జిల్లా సమీపంలోని నాచ్చికుప్పంలో జన్మించారు.తమిళనాడు నుంచి నన్ను విసిరివేస్తే హిమాలయాల్లో పడతానేగానీ మరో రాష్ట్రంలో పడను. తమిళనాడు ప్రజలు ఎంతో సహృదయులు, నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుళ్లు. నన్ను ఇంతగా అభిమానించిన తమిళనాడు ప్రజలు బాగా ఉండాలని కోరుకోవడంలో తప్పేంటి? ఇతరులు మౌనంగా ఉన్నప్పుడు మీరు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్నను నా ముందుంచారు. అవును... ఇంకా ఎందరో ఉన్నారు. స్టాలిన్‌ ఎంతో సమర్థుడైన నేత. అన్బుమణి రాందాస్‌ ఉన్నతవిద్యావేత్త, ప్రపంచమంతా చుట్టివచ్చిన అనుభవశాలి. తిరుమావళవన్‌ తెలివైనవాడు, సీమాన్‌ పోరాట యోధుడు ఇలా ఎందరో ఉన్నారు. అయితే ప్రజాస్వామ్యమే వ్యవస్థ చెడిపోయిందే, దీన్ని మార్చాల్సిన అవసరం లేదా. చెడిపోయిన ప్రజాస్వామ్య వ్యవస్థను మార్చితీరాలి.ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. వారు ఆశిస్తున్న మార్పును ఒక రూపం దాల్చనీయండి. నాపై వస్తున్న విమర్శలను గురించి బాధపడవద్దు. కఠినమైన విమర్శలు వచ్చినపుడే ఎదగగలం. మనల్ని విమర్శించేవారు పరోక్షంగా మనకు సహాయపడుతున్నారు. అందుకే మనల్ని తిట్టినవారి గురించి చింతించవద్దు.’ అన్నారు.


సమావేశం ముగియగానే కల్యాణ మండపం నుంచి ఇంటికి బయలుదేరిన రజనీకాంత్‌ తన కారు పై భాగం అద్దంను తొలగించి పైకి లేచి నిలుచున్నారు. చేయి ఊపుతూ అభివాదం చేశారు. ఈ చర్యను ఏమాత్రం ఊహించని అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. తలైవా...తలైవా అంటూ నినాదాలు చేశారు. ఐదురోజుల పాటూ రజనీ ప్రసంగాలు తమను పులకరింపజేశాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Back to Top