కరుణకే పట్టం

కరుణకే పట్టం


లయోలా కాలేజీ పూర్వ విద్యార్థుల సర్వే

  డీఎంకే 124, అన్నాడీఎంకే 90

 

 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగానూ, డీఎంకేకు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయని చెన్నై లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు అంటున్నారు. ఇటీవల తాము నిర్వహించిన సర్వేలో డీఎంకేకు స్పష్టమైన మెజార్టీ రావడం, కరుణానిధి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తేలినట్లు చెప్పారు. డీఎంకేకు 124 సీట్లు, అన్నాడీఎంకేకు 90 సీట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసినట్లు వారు తెలిపారు.

 

 చెన్నై, సాక్షి ప్రతినిధి: లయోలా కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం కో ఆర్డినేటర్ తిరునావుక్కరసు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాలకుల పనితీరు, ప్రభుత్వ పథకాలు, అవినీతి, అక్రమాలు ఇలా అనేక అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించామని అన్నారు. గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి 11,874 మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. 2011 నుంచి 2014 సెప్టెంబరు వరకు జయలలిత పాలన దారుణంగా ఉందని 37.2 శాతం, 2014 సెప్టెంబరు నుంచి 2015 మే వరకు పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 63.3 శాతం ఘోరంగా ఉందని చెప్పారని అన్నారు.

 

  2015 మే నుంచి ఇప్పటి వరకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉండినా పాలనతీరు బాగాలేదని పేర్కొంటూ 65.9 శాతం మంది అభిప్రాయపడ్డారని అన్నారు. గతంలో కంటే నేడు జయలలితపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని అన్నారు. మండే ఎండల్లో ప్రచారం చేయడం జయపై మరింత వ్యతిరేకతకు కారణమైందని అన్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకే, డీఎంకే మినహా మరో పార్టీలు లేవని 65.9 శాతం, డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి కలిసి ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమని 16.1 శాతం మంది పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ఎన్నికల తీరును బట్టి అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. తరువాత ముఖ్యమంత్రి అర్హత ఎవరు అనే ప్రశ్నకు కరుణానిధికి 88.83 శాతం, జయలలితకు 81.30 శాతం, స్టాలిన్‌కు 77.99 శాతం, అన్బుమణికి 35.58 శాతం, విజయకాంత్‌కు 30.58 శాతం ఉన్నట్లు ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. డీఎంకేకు 39.40 శాతం, అన్నాడీఎంకేకు 35.22 శాతం ఓటు వేయనున్నట్లు చెప్పారు.

 

 తొలి స్థానంలో డీఎంకే, ఆ తరువాతి స్థానంలో అన్నాడీఎంకే ఉన్నట్లు తేలిందని అన్నారు. మూడో కూటమి ఏర్పాటు అన్నాడీఎంకేకు అనుకూలమని భావించడం తప్పని అన్నారు. అన్నాడీఎంకే ఓట్లే ఎక్కువగా చీలుతున్నాయని, డీఎంకేకు సైతం కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారు. కుల సంఘాలు  రాజకీయ పార్టీలుగా మారడం సరికాదని 8.8 శాతం మంది అభిప్రాయపడ్డారని చెప్పారు. ఎవరి నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పడుతుందనే ప్రశ్నకు డీఎంకేకు అనుకూలంగా 37 శాతం, అన్నాడీఎంకేకు అనుకూలంగా 32.9 శాతమని సర్వేలో తేలినట్లు ఆయన తెలిపారు. డీఎంకే కూటమి 112 నుంచి 124 సీట్లు రావచ్చని, అలాగే అన్నాడీఎంకేకు 67 నుండి 90 సీట్లకు పరిమితం కావచ్చని తెలుస్తోందని అన్నారు. అలాగే ప్రజాసంక్షేమ కూటమికి 5 నుండి 11 స్థానాలు, పీఎంకేకు 3 నుండి 7 సీట్లు, బీజేపీకి ఒకటి లేదా రెండు సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్‌కు ప్రజల్లో పలుకుబడి బాగా పెరిగిందని వివరించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top